ఊరూరు నుంచి తరలివచ్చిన బాధితులు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై కలెక్టర్లకు వినతులు సమర్పించారు. దివ్యాంగుడినైన తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని.. రేషన్ కార్డులో జరిగిన తప్పిదాన్ని సరిచేయాలని.. బ్యాంకు రుణాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనే తదితర సమస్యలపై బాధితులు, విద్యార్థి సంఘం నాయకులు ప్రజావాణిలో ఖమ్మం, భద్రాది కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆలకు సోమవారం వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన కలెక్టర్లు తగు చర్యల నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
మామిళ్లగూడెం, డిసెంబర్ 11: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన వినతులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. ఖమ్మంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వైరా మండలం జింకలగూడెం, తాటిపుడికి చెందిన ఎస్.కె.లాల్‌బీ అనే దివ్యాంగురాలు సదరన్ సర్టిఫికెట్ అప్డేట్ చేయించాలని, అలాగే తనకు ట్రై ైసైకిల్ ఇప్పించాలని వినతి అందించింది. కలెక్టర్ వెంటనే స్పందించి వినతిని పరిష్కరించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు. నేలకొండపల్లి బీసీ, ఎస్సీ కాలనీకి చెందిన కొప్పుల వెంకటరామిరెడ్డి తన కుమార్తె రమాదేవికి ఇటీవల వివాహం చేశామని, రేషన్ కార్డులో ఆమె పేరు తొలగించాలని ఆర్జీ పెట్టుకోగా, రెవన్యూ అధికారులు తన భార్య పేరును తొలగించారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాడు. తప్పిదాన్ని సరిచేయాలని కోరాడు. కల్లూరుకు చెందిన టి.శీరీష రేషన్ డీలర్ల నియామక పరీక్షలో తనకు అన్యాయం జరిగిందని, తకువ మారులు వచ్చిన అభ్యర్థిని అధికారులు డీలర్‌గా ఎంపిక చేశారని ఆరోపించింది. విచారించి తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరింది. తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన బి.పద్మకుమారి తన కుమార్తెకు వివాహానికి రావాల్సిన కల్యాణలక్ష్మి పథకంపై వినతి అందించింది. ఖమ్మం నగరానికి చెందిన జి.నాగేంద్ర తన రెండు గదుల ఇంటికి రూ. 322 ఇంటి పన్ను వచ్చేదని, కానీ నగరపాలక సంస్థ రూ.32,299 ట్యాక్స్ కట్టాలని సూచించిందని, విచారించి పన్ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని వినతి అందించాడు. ఖమ్మానికి చెందిన దుగ్గిరాల వెంకన్న అనే వ్యక్తి తన మనవరాలు ఉషశ్రీ దివ్యాంగురాలని, ఆమెకు తండ్రి లేడని, ఎలాంటి ఆధారం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాడు.
ఉషశ్రీకి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరాడు. సత్తుపల్లికి చెందిన పఠాన్ పాషా తన కాళ్లు చేతులు పడిపోయాయని, తనకు పెన్షన్ మంజూరైనా సొమ్ము అందడం లేదని కలెక్టర్‌కు తెలిపాడు. బాధితుడికి న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో మాలతికి సూచించారు. పీడీఎస్‌యూ నాయకులు విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని కలెక్టర్ తల్లాడ మండలం మల్లవరానికి చెందిన దుగ్గిదేవర సామ్రాజ్యం, పెనుబల్లి మండలం చింతగూడేనికి చెందిన కొమ్ము రమేశ్ భూసమస్యపై కలెక్టర్‌కు వినతి అందించారు. కలెక్టర్ అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్‌తో కలిసి పెండింగ్ గ్రీవెన్స్ దరఖాస్తులపై సమీక్షించారు. గ్రీవెన్స్‌కు ఇప్పటి వరకు1,262 దరఖాస్తులు రాగా వాటిలో 953 దరఖాస్తులకు పరిష్కారం చూపామని అధికారులు తెలిపారు. 219 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేసే రాయితీ మంజూరులో జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని యలక సుజాత అనే మహిళ కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కలెక్టర్ ఇతర కార్యక్రమాల సమీక్షకు వెళ్లగా ఆమె అదనపు కలెక్టర్‌కు సమస్యను వివరించింది. 2021 డిసెంబర్లో తాము జేసీబీని కొనుగోలు చేశామని, తర్వాత రాయితీ అందలేదని, దీంతో నెల నెలా వాయిదాలు చెల్లించలేకపోయామని, ఫైనాన్స్ సంస్థ జేసీబీని స్వాధీనం చేసుకున్నదని తెలిపింది. సమస్యను విచారించి నిబంధనల ప్రకారం న్యాయం చేస్తామని అధికారులు ఆమెకు బదులిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి జి.గణేశ్ పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే వినతులను అధికారులు తక్షణం పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఐడీవోసీలో సోమవారం ఆమె ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు అప్పగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పాల్వంచలోని గాంధీనగర్‌లో చేపట్టిన కాలువ నిర్మాణ పనులు సత్వరం పూర్తి చేయాలని, పనులు పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్ వెంటనే స్పందించి పనులు పూర్తి చేయించాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి, ఫైల్ తండా, గేట్ రేలకాయలపల్లి, మూడ్తండా, రంగురాళ్లబోడు గ్రామాలకు చెందిన పలువురు గిరిజన రైతులు బ్యాంక్ రుణాల సమస్యపై కలెక్టర్‌కు వినతి అందించారు. కలెక్టర్స సదరు సమస్యను పరిష్కరించాలని ఎల్డీఎంకు ఎండార్స్ చేశారు. గ్రీవెన్స్‌లో డీఆర్వో రవీంద్రనాథ్, అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.