“వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్‌లోడ్‌తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమానికి ఫోన్ చేసి మీ వాహనం ఓవర్‌లోడ్‌తో వెళ్తుందని సమాచారం వచ్చిందని, వాహనాన్ని ఎవరి కంటపడకుండా జాగ్రత్తపడాలని సూచించాడు.”
“కొత్తగూడెం నుంచి సత్తుపల్లి మీదుగా సిమెంట్ కైంక్లెనర్స్ అధిక లోడుతో నిత్యం రవాణా సాగిస్తుండటంతో రోడ్లు బాగా దెబ్బతింటున్నాయి.. ఈ విషయమై స్థాని కులు స్థానిక రవాణా శాఖ అధికారికి సమాచారం అందించారు. కానీ, సదరు అధికారి ఏమాత్రం స్పందించలేదు. ఇలాంటి ఘటనలు ఖమ్మం జిల్లాలో మోటార్ వెహి కిల్ ఇన్స్పెక్టర్ల అవినీతి పర్వానికి అద్దం పడుతోంది.”

రఘునాథపాలెం, మే 27 : ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారులు నెలవారీ మామూళ్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఓవర్ లోడ్‌తో వాహనాలు అక్రమంగా రవాణా సాగిస్తున్నా.. కన్నెత్తి కూడా చూడటం లేదు. అధిక లోడు, ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్ రాళ్లు రవాణా చేసే వాహనాల వద్ద నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారు. నెలవారీ ఇచ్చిన వాహనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తూ.. ఇవ్వని వాహనాలను రహదారిపై కాపుకాసి పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అధికారులకు ఇచ్చే నెలవారీల ముసుగులో వాహన యజమానులు అక్రమ వ్యాపారానికి తెగబడుతున్నారు. అధికారులు మాత్రం నెలవారీలు ఇస్తున్నారని ఆయా వాహనాలపై కన్నెత్తి చూడకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. అధిక లోడ్ వాహనాల పేరుతో అధికారులకు రూ.కోట్లల్లో నెలవారీ ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ వచ్చే వాహనాలు అంటే రవాణా శాఖ అధికారులు ఎగిరి గంతులేస్తున్నారు.
గ్రానైట్, ఇసుక లారీల నుంచి నెలవారీలు..
ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు. ఖమ్మం నగరంతోపాటు ముదిగొండ, ఖమ్మం రూరల్, గుర్రాలపాడు, తిరుమలాయపాలెం, ముదిగొండ, నేలకొండపల్లి ప్రాంతాల్లో పెద్దఎత్తున గ్రానైట్ పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. ఆయా పరిశ్రమలకు ఖమ్మం జిల్లాతోపాటు నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి గ్రానైట్ రాయి పెద్దఎత్తున తరలివస్తుంది. గ్రానైట్ రాయిని తరలించే వాహనాలన్నీ ఓవర్ టన్నేజీతోనే రవాణా సాగిస్తున్నాయి. రహదారులపై వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యేలా లారీలు, ట్రాక్టర్ల ద్వారా నిత్యం గ్రానైట్ రాయి రవాణా సాగిస్తుంటాయి. కానీ, అధిక లోడ్‌తో వెళ్లే ఆయా వాహనాలను ఆపి కేసులు నమోదు చేసిన సందర్భాలు లేవు. అంతేకాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నిత్యం ఇసుక రీచ్‌ల నుంచి పెద్దఎత్తున లారీలు ఇసుక రవాణా సాగిస్తుంటాయి. 10 టైర్ల వాహనానికి 18టన్నుల ఇసుక బిల్లు ఉన్నా 25 టన్నుల వరకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రీచ్‌ల వద్ద వే బ్రిడ్జ్‌లు లేకపోవడంతో ఓవర్ టన్నేజీతో రవాణా సాగిస్తున్నారు.
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాల నుంచి రవాణా శాఖ అధికారులు కాసులు దండుకుంటున్నారు. ఎక్కడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇక జిల్లాలో ఇసుక, కంకర, మట్టి తోలకాలు చేసే వాహనాలు దాదాపు 3 వేలకు పైగానే ఉన్నాయి. అందులో ఆరు, 10 చక్రాల వాహనాలూ ఉన్నాయి. ఇవికాక నిత్యం ఖమ్మం మీదుగా హైదరాబాద్, విజయవాడ, భద్రాచలం నుంచి ఇతర రాష్ర్టాలకు బిల్లులు లేకుండా సరుకులు తీసుకొని వెళ్లే వాహనాలు దాదాపు ఐదు వందలకు పైగానే ఉన్నాయి. ఆయా వాహనాల వద్ద రవాణా శాఖ అధికారులు నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన రవాణా శాఖ అధికారులతోపాటు వైరా, సత్తుపల్లికి చెందిన రవాణా శాఖ అధికారులకు ఆయా వాహనాల యజమానులు ప్రతి ఒక్కరికీ నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటున్నారు.
ప్రైవేటు అసిస్టెంట్లు, దళారీలతో వసూళ్లు..
వాహనదారుల నుంచి నెలవారీ మామూళ్లను వసూళ్లు చేసేందుకు ప్రత్యేకంగా దళారులు, పర్సనల్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరి ద్వారా నెలవారీ ఈ ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. నెలవారీ మామూళ్లు ఇచ్చుకున్న వాహనాల నెంబర్ల లిస్ట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వద్ద ఉంటుంది. అధికారుల వద్ద ఉన్న నెంబర్లకు చెందిన వాహనాలు సరైన పత్రాలు లేకున్నా, ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా తనిఖీలు చేయరు. నెలవారీ ఇవ్వని వాహనాలు తిరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే నిలిపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తారు. వాహన యజమానులు తమ వాహనం తిరిగే రూట్ల వారీగా మామూళ్లు సమర్పించుకుంటారు. ఒక్కో వాహనానికి రవాణా శాఖ అధికారులకు దాదాపు రూ.2,700 వరకు నెలవారీ ఇచ్చుకుంటారనేది సమాచారం. ఇలా దాదాపు వందల సంఖ్యలో లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్ల రూపంలో రవాణా శాఖ అధికారులకు నెలకు రూ.కోటికి పైగానే మామూళ్ల రూపంలో చేరుతున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ అధికారుల నెలవారీల వసూళ్ల పర్వం ఏళ్లుగా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇంతా జరుగుతున్నా పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.