ఇంటింటా భోగభాగ్యాలు నింపింది భోగి. పల్లెలన్నీ భోగి మంటల్లో మెరిసిపోయాయి. ప్రజలంతా భోగి సంబురాల్లో మురిసిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఊరూవాడా సోమవారం భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పల్లె, పట్నం తేడాలేకుండా తెల్లవారుజామున భోగి మంటల్లో పాత వస్తువులను వేసి దహనం చేశారు.
మహిళలు ఉదయాన్నే ఇళ్ల ముంగిళ్లు, ఆవరణను నీటితో శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు. ఇంటిగుమ్మాలను బంతిపూలతో అలంకరించారు. బంధువులను ఇళ్లకు పిలిచి చిన్నారులకు భోగి(రేగి పండ్లు) పండ్లు పోసి ఆశీర్వదించారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
చిన్నారులు, యువతీ యువకులు ఖాళీ ప్రదేశాలతోపాటు ఇళ్లపైకి ఎక్కి గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. మహిళలు సకినాలు, అరిసెలు వంటి పిండివంటల్లో నిమగ్నమయ్యారు. బంధువులు, మిత్రులు పరస్పరం భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నేడు(మంగళవారం) మకర సంక్రాంతి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
– నమస్తే నెట్వర్క్