ఖమ్మం రూరల్, జూన్ 19 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేటలో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే పేరుతో ఐసీడీఎస్ సిబ్బంది అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని జలగం నగర్ సెక్టార్ యందు గల నాయుడుపేట అంగన్వాడీ 2 కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపాలిటీ కౌన్సిలర్ కడవ నవీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాలతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారులకు ప్రైవేట్ కాన్వెంట్ల కంటే అంగన్వాడీ కేంద్రాల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఆంగ్ల బోధనతో పాటు, సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని, గర్భిణీలు, బాలింతలు విధిగా కేంద్రాలకు వచ్చి సేవలు పొందాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి సరోజిని, సరిత, దుర్గారాణి, ఆయాలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.