ఖమ్మం సిటీ, నవంబర్ 14 : ‘నాలుగైదు నెలలుగా వేతనాల్లేవు.. అయినా మురికి పనులు చేస్తూనే ఉన్నాం.. పస్తులతోనే బతుకు బండిని లాగించుకుంటూ వస్తున్నం.. ఇక మా వల్ల కావట్లేదు.. తక్షణమే పెండింగ్‌తో కలిపి మొత్తం వేతనాలను ఇప్పించండి సారూ’ అంటూ గ్రామ పంచాయతీ వర్కర్లు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను వేడుకున్నారు. గురువారం కలెక్టరేట్లో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యనేతలు ఆయనకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మునుపెన్నడూ ఇటువంటి దుస్థితి నెలకొనలేదన్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వారంతా నిరుపేదలేనని, నెలల తరబడి వేతనాలు చెల్లించకుంటే చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు కడుపునిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నామని వాపోయారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఖాన్ వేతనాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాయకులు కే నాగరాజు, పంగ లాలయ్య, ఎస్కే హుస్సేన్, నాగేశ్వరరావు, గౌతమ్, రామకృష్ణ, సైదులు, కొమరయ్య, రామారావు, వెంకన్న పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 14 : స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దామాషాపై ఈ నెల 17వ తేదీన బహిరంగ విచారణ చేస్తున్నామని, ఆసక్తి కలిగిన బీసీ కులసంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర కులసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజలు హాజరై వారి అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దామాషా ఖరారు చేసేందుకు బీసీ కమిషన్ డెడికేషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు, సెక్రటరీ బి.సైదులు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నట్లు తెలిపారు.
ఈ నెల 17వ తేదీన ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా కులాల స్థితిగతులపై డెడికేటెడ్ కమిషన్‌కు వ్యక్తులు, నమోదిత, నమోదు కాని అసోసియేషన్లు వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం మెటీరియల్ సాక్ష్యాలను, సంబంధిత విషయాలను పేరొంటూ స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన, అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేరొనే విషయంలో సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు కమిషన్ ఎదుట తెలియజేయాలని ప్రకటనలో పేరొన్నారు.