భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, నవంబర్ 26 : ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఘట్టం మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అదేరోజు సాయంత్రానికి పోటీలో ఉన్న అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
మొదటి విడతలో భాగంగా ఖమ్మం జిల్లాలో 192, భద్రాద్రి జిల్లాలో 159 గ్రామాలకు వచ్చే నెల 11న పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకోసం జిల్లా కేంద్రం ఆయా మండల కేంద్రాలకు సంబంధిత బ్యాలెట్ బాక్సులు కూడా చేరుకున్నాయి. ఈ నెల 25న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నూతన సంక్షేమ పథకాలకు బ్రేక్ పడినట్లయింది.
ఖమ్మం జిల్లాలో మొత్తం 566 గ్రామ పంచాయతీల్లోని 566 సర్పంచ్ స్థానాలకు, 5,168 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పంచాయతీల్లో వచ్చే నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి విజేతను ప్రకటిస్తారు. ఇందులో భాగంగా గురువారం నుంచి మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఆ తరువాత రోజు నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన నామినేషన్ల ప్రకటన ఉంటుంది. ఆ మరుసటి రోజు అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అదే రోజున పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే, ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగనున్న ఏడు మండలాల్లో పలు సమస్యాత్మక గ్రామాలను అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని గుర్తించి బైండోవర్ చేస్తారు. నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. బోనకల్లు మండలంలోని 22 గ్రామాల్లో 36,381 మంది, చింతకానిలోని 26 గ్రామాల్లో 41,707 మంది, కొణిజర్లలోని 27 గ్రామాల్లో 41,864 మంది, మధిరలోని 27 గ్రామాల్లో 31,728 మంది, రఘునాథపాలెంలోని 37 గ్రామాల్లో 40,790 మంది, వైరాలోని 22 గ్రామాల్లో 27,306 మంది, ఎర్రుపాలెంలోని 31 గ్రామాల్లో 40,425 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
భద్రాద్రి జిల్లాలో తొలి విడతలో 8 మండలాల్లోని 159 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కలెక్టరేట్లోని ఎన్నికల సామగ్రిని అధికారులు ఇప్పటికే ఆయా పంచాయతీలకు చేరవేశారు. మండల అధికారులు పోలింగ్ బూత్‌లకు వెళ్లి సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అశ్వాపురం మండలంలో 7 పంచాయతీల్లో, భద్రాచలంలో 1, బూర్గంపహాడ్‌లో 8, చర్లలో 7, దుమ్ముగూడెంలో 8, మణుగూరులో 8, పినపాకలో 6 , కరకగూడెంలో 2 చొప్పున నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు.
భద్రాద్రి జిల్లాలో జరిగే తొలి విడత ఎన్నికలకు అధికారులు 1,510 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు రిటర్నింగ్ అధికారులు(ఆర్వో)లను, ఏఆర్వోలను, ఓఆర్వోలను, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించి విధులు కేటాయించారు. ఎన్నికలు జరిగే వరకు ఉద్యోగులకు సెలవులు ఉండవని అధికారులు ప్రకటించారు.
రాష్ట్ర ఆవిర్భావ సమయంలో భద్రాచలం పట్టణం మినహా ఆ మండలంలోని గ్రామాలన్నీ ఏపీలో విలైనమైన విషయం విదితమే. దీంతో ఈ ఎన్నికల్లో ఏకైక పంచాయతీగా ఉన్న భద్రాచలానికి కూడా మొదటి విడతలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులోని 20 వార్డులకు కూడా అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు.