భద్రాచలం, డిసెంబర్ 8 : భద్రాచలం పట్టణం గులాబీమయమైంది. గులాబీ, ఎరువు రంగుల జెండాలు, బెలూన్లతో భారీ ర్యాలీ పట్టణమంతా సాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సీపీఎం, జీడీపీ మద్దతుతో బీఆర్ఎస్ బలపర్చిన మానె రామకృష్ణ పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన విజయం కోసం బీఆర్ఎస్, సీపీఎం, జీడీపీ కూటమి నేతలు సోమవారం భద్రాచలం పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అంబేదర్ సెంటర్ వద్ద మొదలైన ఈ ర్యాలీ.. యూబీ సెంటర్, తాతగుడి సెంటర్, రాజ వీధి, రామాలయం వీధుల మీదుగా ముందుకు సాగింది.
పట్టణ ప్రజల నుంచి మానె రామకృష్ణకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్చలో వచ్చిన మానె రామకృష్ణకు పూలదండలు వేసి అభినందించారు. పట్టణ ప్రజలతోపాటు బీఆర్ఎస్, సీపీఎం, జీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మానె రామకృష్ణను గెలిపించాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం సర్పంచ్ అభ్యర్థి మానె రామకృష్ణ, కూటమి నాయకులు రావులపల్లి రాంప్రసాద్, బండారు రవికుమార్, గుండు శరత్ మాట్లాడారు.
కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానె రామకృష్ణను గెలిపిస్తే భద్రాచలం పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కూటమి నేతలు పేర్కొన్నారు. పట్టణంలోని 20 వార్డులనూ తీర్చిదిద్ది మోడల్ పట్టణంగా భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. గ్రామ పంచాయతీలో ప్రజాదర్బార్ నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటామని, వాటి తక్షణ పరిషారానికి ప్రయత్నిస్తామని అన్నారు.
ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న మానె రామకృష్ణను రాజకీయాలకు అతీతంగా ప్రజలందరమూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అలాగే, బీఆర్ఎస్ కూటమి మద్దతుతో పోటీ చేస్తున వార్డు సభ్యులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. కూటమి నాయకులు గడ్డం స్వామి, బండారు శరత్‌బాబు, ఆకోజు సునీల్, సింధు, కోటగిరి ప్రబోద్‌కుమార్, కొల్లోజు ప్రేమ్‌కుమార్, కావూరి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.