చర్ల, మే 5: అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్.. అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చర్ల మండలం సత్యనారాయణపురంలో ఏర్పాటుచేసిన పెద్దపల్లి – ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్లు, హమాలీలు, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి తగినన్ని లారీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం సత్యనారాయణపురంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చర్ల ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, హౌసింగ్ నిర్మాణశాఖ ఏఈ ముకేశ్, ఇతర అధికారులు లావణ్య, అరుణ్, రాము, డాక్టర్ సాయివర్ధన్, డాక్టర్లు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావు, జాన్ తదితరులు పాల్గొన్నారు.