కారేపల్లి, ఆగస్టు 04 : విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుదని యూటీఎఎఫ్ జిల్లా కార్యదర్శి, టీపీటీఎఫ్ రాష్ర్ట నేత పద్మ, టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బన్సీలాల్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం కోవట్లగూడెం హైస్కూల్లో యూఎస్పీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలపై చర్చల పేరుతో తాత్సారం చేయడం తప్పా ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదన్నారు. అన్ని క్యాడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎం, ఎస్ఏ, పీఎస్ హెచ్ఎం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. జీఓ నంబర్ 25ను సవరించటం ద్వారా ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి ఏడాది వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలన్నారు. విద్యారంగంలో ఎన్జీవోల జోక్యాన్ని నివారించాలన్నారు. విద్యారంగ సమస్యలపై ఈ నెల 5వ తేదీన జరుగు ధర్నాను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం విద్యారంగ సమస్యలపై కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు, కేవీ కృష్ణా రావు, బి.మంగీలాల్, ఎం.హరీశ్, బి.శ్రీనివాసరావు, ఏ.బన్సీలాల్, ఈరు నాయక్, మంద రాములు, శారద, ప్రేమ్ సాగర్, జ్యోతి పాల్గొన్నారు.