మణుగూరు టౌన్, నవంబర్ 22: ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచార పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష, కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ఉన్నాయనేది తేటతెల్లమైందని తేల్చిచెప్పారు.
ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ను కట్టడి చేయడానికి, కేటీఆర్‌ను ఎదుర్కోవడానికి రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌పై చేసే కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని, అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 29న దీక్షా దివస్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు, అన్ని మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.