మణుగూరు టౌన్, అక్టోబర్ 6: తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని సామాజిక వర్గాలకూ ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలకూ ఆత్మగౌరవ భవనాలు ఉండాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. మణుగూరులోని తోగ్గూడెం, గుట్టమల్లారం వద్ద రూ.1.50 కోట్లతో నిర్మించతలపెట్టిన రెడ్డి, మున్నూరుకాపు సంఘాల ఆత్మగౌరవ భవనాల పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. హైదరాబాద్ నగరంతోపాటు అన్ని నియోజకవర్గాల్లోనూ వివిధ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు.
ఆయా సామాజిక వర్గాల ప్రజలు తమ సంఘ సమావేశాలు, శుభకార్యాలు జరుపుకునేందుకు ఈ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వీటిని త్వరితగతిన నిర్మించి ఆయా సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ రేగాను రెడ్డి సంఘం బాధ్యులు గజమాలతో సత్కరించారు. మున్నూరుకాపు నాయకులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించారు. మణుగూరు, బూర్గంపహాడ్ జడ్పీటీసీలు పోశం నర్సింహారావు, కామిరెడ్డి శ్రీలత, ఎంపీపీ కారం విజయకుమారి, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు ముత్యం బాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, వట్టం రాంబాబు, జావేద్పాషా, రెడ్డి, మున్నూరుకాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు.