దుమ్ముగూడెం, ఏప్రిల్ 4: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తోనే దేశానికి మంచి రోజులు రానున్నాయని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఆయన ముందుచూపు దేశానికి ఎంతో అవసరమని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలూ చర్చించుకుంటున్నారని అన్నారు. దుమ్ముగూడెం మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. తొలుత లక్ష్మీనగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ గురించి చర్చ జరుగుతుండడం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలవడంతో ఇటీవల కొందరు బీఆర్ఎస్పై దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏకతాటిపైకి రావాలని, సమష్టిగా పనిచేసి పార్టీ గెలుపులో భాగం కావాలని సూచించారు. త్వరలో మండలంలో జరగనున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం నాయకులందరూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు ఆహ్వానపత్రాలు అందించాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. సమావేశం అనంతరం పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆయా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు అన్నెం సత్యనారాయణమూర్తి, రేసు లక్ష్మి, కణితి రాముడు, ఎండీ జానీపాషా, తునికి కామేశ్, సీత, మానే రామకృష్ణ, అరికెళ్ల తిరుపతిరావు, మట్టా వెంకటేశ్వరరావు, సోడె జ్యోతి, భూక్యా చందు, కాటబోయిన వెంకటేశ్వర్లు, సోడి కొండయ్య, తెల్లం రామకృష్ణ, భూపతి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.