బోనకల్లు, సెప్టెంబర్ 20 : కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో లక్ష్మీపురం నుంచి గోవిందాపురం ఎల్, గార్లపాడు, రావినూతల మీదుగా బోనకల్లు తహసీల్దార్ కార్యాలయం వరకు శనివారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహసీల్ ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రాన్ని తహసీల్దార్ రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తులకు పరిష్కారం చూపడం లేదన్నారు.
దీంతో ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్న పేదలు, దివ్యాంగులు, వితంతువులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, లేదంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మడుపల్లి గోపాల్రావు, పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, తుళ్లూరు రమేశ్, గుడ్డురి ఉమ, జొన్నలగడ్డ సునీత, చిట్టుమోదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.