మధిర, అక్టోబర్ 20: రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మధిర గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, ఆ పార్టీ మోసపు మాటలను ప్రజలకు వివరించాలని సూచించారు. మధిర వర్తక సంఘం కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి యువజన విభాగం సోషల్ మీడియా విభాగ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సోషన్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి, యువజన విభాగం కన్వీనర్ కూన నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమల్‌రాజు మాట్లాడుతూ..
స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఈ నియోజకవర్గానికి విజిటర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అవసరాల కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం హైదరాబాద్‌కే పరిమితమైతే ఇక్కడి ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు. విజిటర్‌గా వచ్చిపోయే ఎమ్మెల్యేను కాకుండా నిత్యం ప్రజలతో మమేకయ్యే తనను గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ దినేశ్‌చౌదరి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వేదికగా ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. యువజన విభాగం నేతలు చింతనిప్పుల కృష్ణచైతన్య, షేక్ నజీర్, ముడావత్ సైదా పాల్గొన్నారు.