ఖమ్మం, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లా పరిషత్‌ల చైర్మన్ పదవులకు రిజరేషన్లు కేటాయించడంతో పార్టీలు రంగంలోకి దిగాయి. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీకి, భద్రాద్రి జడ్పీ చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మండలస్థాయిలో అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయ కోలాలహం మొదలైంది. 2019లో ఖమ్మం, భద్రాద్రి జిల్లా పరిషత్‌లకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేర్వేరుగా ఎన్నికలను నిర్వహించింది.
భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అప్పుడు ఎస్టీలకు కేటాయించగా బీఆర్ఎస్ నుంచి టేకులపల్లి జడ్పీటీసీగా ఎన్నికైన కోరం కనకయ్య.. భద్రాద్రి జిల్లా పరిషత్ తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలాగే, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని ఎస్సీకి కేటాయించగా మధిర జడ్పీటీసీగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లింగాల కమల్‌రాజు ఖమ్మం జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండు జిల్లా పరిషత్‌ల చైర్మన్ పదవుల రిజర్వేషన్లు మారడంతో ఈసారి తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు అనేకమంది రాజకీయ నేతలు పలు రాజకీయ పార్టీల నుంచి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా పరిషత్ తొలి చైర్మన్‌గా జలగం వెంగళరావు ఎన్నిక కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా చివరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా బరపాటి వాసుదేవరావు పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎక్కువసార్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. టీడీపీ, బీఆర్ఎస్ కూడా జడ్పీ చైర్మన్ల పదవులను అధిష్టించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌కు గిరిజన వర్గానికి చెందిన వాణీ రమణారావు, కూనం రామచంద్రయ్య, చందా లింగయ్యలు గతంలో జడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. ఇక 1987లో టీడీపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేకూరి కాశయ్య అనేకమార్లు, 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా టీడీపీ నుంచి గడిపల్లి కవిత ఎన్నికయ్యారు. ఆ తరువాత కొద్దికాలానికి ఆమె బీఆర్ఎస్లో చేరారు. 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించి జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది.
జడ్పీ చైర్మన్‌గా లింగాల కమల్‌రాజు, వైస్ చైర్మన్‌గా నేలకొండ జడ్పీటీసీ ధనలక్ష్మి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వు అయింది. అయితే, సత్తుపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల జడ్పీటీసీ స్థానాలు ఎస్టీలకు ఖరారయ్యాయి. ఇందులో తిరుమలాయపాలెం, సత్తుపల్లి జడ్పీటీసీ స్థానాలను గిరిజన మహిళలకు, కూసుమంచి, కొణిజర్ల జడ్పీటీసీ స్థానాలు గిరిజన జనరల్‌కు కేటాయించారు. ఈ నాలుగు మండలాల నుంచి విజయం సాధించిన వారే ఆయా రాజకీయ పార్టీల సాధించిన మెజారిటీ స్థానాల ఆధారంగా జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అలాగే, ఆయా రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల్లో భాగంగా కామేపల్లి, సింగరేణి మండలాల్లో జనరల్ స్థానాలుగా ఉండడంతో వీటిలో సైతం గిరిజన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మదు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులు ఈ ఎన్నికల కోసం 10 నియోజకవర్గాల కార్యకర్తలు, ముఖ్య నాయకులను సమాయత్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికే పిలుపునిచ్చింది.
రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలపైనా, వాటిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఇటీవలే నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించేందుకు దృష్టి సారించాలని కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు,
ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఇతర నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ తదితరులు ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీలు కార్యకర్తలను, ముఖ్య నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేతలు రాకేశ్‌రెడ్డి తదితరులు శ్రేణులకు దిశానిర్దేశం చేశార. తాజాగా రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు.