కొనుగోలు కేంద్రాల వద్ద కర్షకులు కన్నీటి గోస అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. ఓ వైపు పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తెచ్చినప్పటికీ.. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదు. దీంతో అష్టకష్టాలు పడుతున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాలు మరిన్ని పరీక్షలు పెడుతున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల వారాల తరబడి నిరీక్షించిన రైతుల వద్ద పంటను కొనుగోలు చేసినప్పటికీ.. సకాలంలో తరలించకపోవడంతో అక్కడ కూడా అన్నదాతే బలిపశువు అవుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం అకాల వర్షాలకు తడవడంతో అక్కడ కూడా అన్నదాతే నిలువునా బలి అవుతున్నాడు.
-ఇల్లెందు, మే 14
పంటను అమ్ముకునేందుకే వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న రైతులు.. అష్టకష్టాలు పడి పంటను అమ్ముకున్నాక.. ప్రభుత్వం ఆ పంటను తరలించుకొనిపోయే వరకూ రైతే బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వం వారాల తరబడి తరలించకపోవడంతో దానిని కాపాడుతూ రైతులు కూడా అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో అకాల వర్షాలు వచ్చి పంటంతా తడిచిపోతోంది.
పైగా, తడిసిన మొక్కజొన్న గింజలు తెల్లారేసరికి మొలకలొస్తున్నాయి. దీంతో వాటిని చూసి కర్షకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంటను లోడ్ చేసుకొని వెళ్లే వరకూ రైతులదే బాధ్యత అంటూ ప్రభుత్వం చెబుతోంది. ఆ సమయంలో పంటకు ఏం జరిగినా రైతునే బాధ్యుడిని చేస్తోంది. సదరు పంటకు తన చేతిలో నష్టం వాటిల్లినా, ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాక నష్టం వాటిల్లినా రైతే బాధ్యత వహించాల్సి వస్తోంది. దీంతో అతడు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇల్లెందు మండలంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట.. తీరా వారి నోటికాడికి వచ్చే సరికి అందకుండాపోతోంది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ దుస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు పంట తడవడంతో వారు పడుతున్న బాధ అంతాఇంతా కాదు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద గురువారం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసింది. దానిని చూసి రైతులు కంటతడి పెట్టుకున్నారు. ఇల్లెందు మండల రైతులు ఇక్కడ అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటనే సాగు చేస్తున్నారు.
పంట చేతికి రావడంతో స్థానిక దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమ పంటను వారికి అమ్మకుండా ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులు భావించారు. అందుకోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తమ పంటను తరలించారు. అక్కడ టార్పాలిన్లు సహా ఇతర వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. సరిగ్గా అదే సమయంలో అకాల వర్షం వచ్చింది. దీంతో రైతులు తమ పంటను కాపాడుకునేందుకు ఎంతలా ప్రయత్నించినా పూర్తిస్థాయిలో కాపాడుకోలేకపోయారు. దీంతో చాలావరకూ పంటంతా ఆ అకాల వర్షానికి తడిసింది. అలా తడిసిన పంటలో కొంతమేరకు మొలకలు కూడా వచ్చాయి.
ఇల్లెందు మండల రైతులు 27 వేల ఎకరాల్లో ఈ సీజన్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఈ గణాంకాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దిగుబడి అంచనాలను కూడా సమర్పించారు. కానీ, అందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. తీరా పంట చేతికి వచ్చాక దానిని అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లిన రైతులకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసిన పంటను వెనువెంటనే తరలించకపోవడం వంటి కారణాలతో అంతిమంగా అన్నదాతలే అవస్థలు పడాల్సి వస్తోంది.
మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. పంట చేతికొచ్చింది. దానిని అమ్ముకునేందుకు 25 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చాను. కానీ, ఇక్కడి సమస్యలు మమ్మల్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో మేము పండించిన మొక్కజొన్నలను ప్రభుత్వానికి అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం. గన్నీ బ్యాగులు రాలేదని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టారు. లారీలు రాలేదని మరికొన్ని రోజులు ఇబ్బంది పెట్టారు. దీంతో పంటను ఇక్కడే ఉంచాము. ఇంతలో అకాల వర్షం వచ్చింది. పంటంతా తడిసింది. ముక్క వాసన వస్తోంది. ఈ పంటను ప్రభుత్వమే షరతులు లేకుండా కొనాలి.
-బానోత్ శారద, మహిళా రైతు, మసివాగు వార్డు మెంబర్
మండలంలో సుమారు 27 వేల ఎకరాల్లో రైతులు మక్కలు సాగు చేశారు. ఈ ఏడాది రైతులందరికీ ఒకేసారి పంట చేతికొచ్చింది. దీంతో రైతులు కూడా అధిక మొత్తంలో పంటను తీసుకొని ఒకేసారి కొనుగోలు కేంద్రానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో అకాల వర్షాలు రావడంతో పంట తడిసిపోయింది. అయితే, అకాల వర్షం వల్ల వచ్చిన పంటను కాపాడేందుకు సరైన వసతులు కల్పించలేకపోయాం. దానికితోడు లారీలు సరిగ్గా రాలేదు. అందువల్ల కొనుగోలు చేసిన మక్కలను కూడా సకాలంలో తరలించలేకపోయాం. అప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలుగా స్థానిక మార్కెట్ యార్డులో ఉన్న గోదాములోకి, కారేపల్లి గోదాములోకి మక్కలను తరలిస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మక్కలను తరలించి రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తాం.
-మెట్ల కృష్ణ, సొసైటీ చైర్మన్, ఇల్లెందు
ఏటా మొక్కజొన్న పంటను సాగుచేస్తున్నాను. అయితే, ఆ పంటను విక్రయించే విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు పడలేదు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అనేక కష్టాలు పడుతున్నాం. ఈ ఏడాది ఇంకా ఇబ్బందులు పడుతున్నాం. కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రం వద్ద అకాల వర్షానికి తడుస్తోంది. ప్రభుత్వం ఇక్కడ టార్పాలిన్లు కూడా అందుబాటులో ఉంచకపోవడంతో చూస్తుండగానే పంటంతా తడిసిపోయింది. తడిసిన పంటను చూస్తే బాధగా అనిపిస్తోంది.
-బానోతు మోతియ, మసివాగు తండా, ఇల్లెందు