ఖమ్మం, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ది రైతుల వ్యతిరేక ప్రభుత్వమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తోందని, పంటల కొనుగోలులో విఫలమై రైతులను నట్టేట ముంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వారు ఎండగట్టారు. కేసీఆర్ పాలనలో పంట చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉండేవని గుర్తుచేశారు.
మార్చి 15 నాటికే అన్నిచోట్లా కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉన్నా.. ఇంకా చాలాచోట్ల ప్రారంభించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వరికి మద్దతు ధర రూ.2,389 ఉంటే, కేంద్రాల్లేక రైతులు బయట రూ.1,800కే అమ్ముకుంటున్నారని, క్వింటాకు రూ.600 నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ఉండగా బయట రూ.1,500కే అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని, ఫలితంగా క్వింటాకు రూ.900 నష్టపోతున్నారని ఆవేదన చెందారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు సిండికేట్ అయ్యారని, సత్తుపల్లి వంటి ప్రాంతాలకు నెల్లూరు నుంచి ధాన్యం వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.500 బోనస్ ఊసేలేకుండా పోయిందని; రైతుభరోసా, రైతుబీమాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసిందని విమర్శించారు.
హరీశ్‌రావు అరెస్టు దుర్మార్గం: కమల్‌రాజు
పారిశ్రామికాభివృద్ధి పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆరోపించారు. దానిని అడ్డుకోవడానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావును అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. చింతకాని మండలంలోని ఒక్క గ్రామంలోనే 50 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం కేవలం 22 వేల బస్తాలు మాత్రమే కొనుగోలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొక్కజొన్న రైతులు రోడ్లపై పంటను ఆరబెట్టుకొని వర్షానికి తడిసిపోతుంటే జిల్లా మంత్రులు ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.
పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీని ఐదేళ్లలో ఎప్పుడో అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. గన్నీ బ్యాగులు, లారీలు, సిబ్బందిని వెంటనే కేటాయించాలని, మద్దతు ధరతోపాటు ప్రకటించిన రూ.500 బోనస్‌ను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అన్ని మండల కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు కూరాకుల నాగభూషణం, ఉన్నం బ్రహ్మయ్య, వాచేపల్లి లక్ష్మారెడ్డి, కనగాల వెంకట్రావు, పగడాల నరేందర్, సామినేని హరిప్రసాద్, ముత్యాల వెంకటప్పారావు, మంకెన రమేశ్, బొడ్డు వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌రావు అరెస్టు పట్ల ఖండన..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అరెస్టును మాజీ మంత్రి అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉద్యమ నేత ఉప్పల వెంకటరమణ తదితరులు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.