ఖమ్మం రూరల్/ కూసుమంచి(నేలకొండపల్లి), సెప్టెంబర్ 3 : వరద బాధితులను అప్రమత్తం చేయడంలో, వరద ఉధృతి తగ్గిన తరువాత సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని సాయిగణేష్‌నగర్‌లో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాల్సిన తరుణంలో సాయం చేయకపోగా విపక్షాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వదర ఉధృతి తగ్గి మూడురోజులు కావస్తున్నా కనీసం మండలంలోని తీర్ధాల, రాజీవ్ గృహకల్స, టీచర్స్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వాల్యాతండా, కస్నాతండా, తనగంపాడు, జలరగంనగర్, నాయుడుపేటలో అటు ప్రజాప్రతినిధిలు కానీ, అధికారులు కానీ సాయయక చర్యలు చేపట్టడంలేదన్నారు.
వరద బాధితుల పరిస్థితిని చూస్తే ప్రతిఒక్కరికీ దుఖం వస్తున్నదని, ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం రావడం లేదన్నారు. బాధితులకు తాగునీరు. ఆహారం, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సింది పోయి ప్రచారం ఆర్భాటం చేయడం సిగ్గుచేటన్నారు. ఎక్కడికి పోయినా నాటి సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష సాయం చేయాలన్నారు.
ఇండ్లు దెబ్బతిన్న వారికి సొంతగృహాలు, విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, గూడ సంజీవరెడ్డి, ముత్యం క్రిష్ణారావు, సొసైటీ చైర్మన్ లక్ష్మణ్‌నాయక్, పేరం వెంకటేశ్వర్లు, మేకల ఉదయ్, మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ సాయం అందేవరకు కొట్లాడుతాం
వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందే వరకు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. రాజీవ్ గృహకల్ప, దానవాయిగూడెం, తీర్థాల, తనగంపాడు, కస్నాతండా, వాల్యాతండా గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. దెబ్బతిన్న ఇండ్లు, నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. నేలకొడపల్లి మండలం సుర్ధేపల్లి, రామచందాపురం, కట్టుకాసారం ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, హుస్సేన్ పాల్గొన్నారు.