చెమటోడ్చి పండించిన పంట కండ్లముందే మొలకెత్తుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనే దిక్కులేకపోవడంతో రైతన్నలు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ఆకాశంవైపు చూస్తూ భయపడుతూ.. బాధపడుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. చచ్చీబతికీ సన్నరకం వడ్లను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం వాటిని తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది.
ఇక దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా పూర్తిగా వదిలేయడంతో అన్నదాతల వ్యధ వర్ణించ తరంకావడం లేదు. దొడ్డురకం ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం.. రైతులెవ్వరూ బాధపడొద్దని మాటలు చెబుతున్న అధికారులు అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి పండించిన పంటను సైతం అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
– అశ్వారావుపేట టౌన్, మే 16
అశ్వారావుపేట సొసైటీ పరిధిలోని ఊట్లపల్లి, అశ్వారావుపేట, జమ్మిగూడెం గ్రామాల పరిధిలో రైతులు చెరువులు, బోర్ల కింద సన్నరకం వడ్లతోపాటు దొడ్డు రకం వడ్లను కూడా పండించారు. పండించిన పంటను సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. సొసైటీ అధికారులు నిన్నటివరకు సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. అయితే దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు మండిపడుతున్నారు. కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు తడిసి మొలకెత్తుతున్నదని త్వరగా కొనుగోలు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.
ధాన్యాన్ని కొనేదిక్కు లేదు..
అధికారుల అలసత్వంతో కొనుగోలులో జాప్యం కారణంగా దొడ్డురకం ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే మగ్గుతున్నది. అనేక పర్యాయాలు మా ధాన్యం కొనండి సారూ.. అంటూ అధికారులకు మొరపెట్టుకున్నా కుంటిసాకులు చూపుతూ తాత్సారం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి నేటికి 22రోజులు గడిచినా అధికారులు మాత్రం దయచూపడం లేదని మండిపడుతున్నారు. కోత కోసిన దగ్గర నుంచి పరదాలు కొనేవరకు ఎకరాకు రూ.15 వేలు ఖర్చు వస్తున్నదని రైతులు చెబుతున్నారు.
దళారులకే అమ్ముకుంటున్న రైతులు..
కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతున్న దొడ్డురకం ధాన్యం అకాల వర్షాలకు తడుస్తూ మొలకెత్తుతుండడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికారులను ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో చేసేదిలేక దళారులకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. దీంతో బస్తాకు రూ.350 నుంచి రూ.400 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం సన్నరకానికి బోనస్‌తో కలుపుకుని బస్తాకు రూ.2,820 ఇస్తుండగా.. దొడ్డురకం ధాన్యానికి రూ.2,300 ఇస్తున్నది. మిల్లులు ఖాళీ లేవనే సాకుతో దొడ్డురకం కొనుగోలు చేయడం లేదని చిన్నంశెట్టి రాంబాబు, కొత్త ప్రవీణ్ తదితర రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిక్కులేక ప్రైవేటుకు అమ్ముకున్నా..
పదిహేను ఎకరాల్లో వరిసాగు చేసి పంటను అశ్వారావుపేట ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా.. నేటికి 20రోజులు దాటినా పట్టించుకున్న నాధుడులేడు. శాంపిల్ పట్టుకెళ్లి 15 రోజులైంది. అకాల వర్షాలు పడుతున్నాయి. రాసుల్లో అడుగు ధాన్యం మొలకెత్తి పాడువుతున్నది. దీంతో చేసేదిలేక బస్తాకు రూ.350 తక్కువకు ప్రైవేటోళ్లకు అమ్ముకున్నాను.
– కొత్తా ప్రవీణ్, రైతు, అశ్వారావుపేట
రైతులను పురుగుల్లా చూస్తున్నారు..
వడ్లు రాసులుగా పోసి 20రోజులు అవుతున్నది. అధికారులు వచ్చి తిరిగి చూసివాళ్లే లేరు. ఫోన్లు చేసినా ఎత్తడంలేదు.. స్వయంగా కలిసి అడిగితే మిల్లుల దగ్గరకు వెళ్లి అమ్ముకోండి అని చెబుతున్నారు. రైతులను అధికారులు పురుగులను చూసినట్లు చూస్తున్నారు. రైతులు చేసేదిలేక ధాన్యాన్ని ప్రైవేటోళ్లకు నష్టానికే అమ్ముకుంటున్నారు.
– చిన్నంశెట్టి రాంబాబు, రైతు సంఘం నాయకుడు, అశ్వారావుపేట
రెండ్రోజుల్లో కొంటాం..
మిల్లర్ల సమస్య తీవ్రంగా ఉంది. అయితే ఇప్పటికే మిల్లర్లతో మాట్లాడినం.. మరో రెండ్రోజుల్లో దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు సమన్వయం పాటించాలి. ప్రైవేట్ వాళ్లకు అమ్ముకొని నష్టపోవద్దు.
– మానేపల్లి విజయబాబు, అశ్వారావుపేట సొసైటీ సీఈవో