కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఉద్యోగులు కొందరు బరితెగిస్తున్నారు. చేయి తడిపితేనే పనులు చేస్తున్నారు. అన్ని శాఖల్లోనూ అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14 నెలల్లో 15 మంది అధికారులు ఏసీబీకి చిక్కి సర్కార్ పరువు తీసేశారు. పెద్దసార్లు పట్టించుకోకపోవడంతో కిందిసార్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా అందినకాడికి దండుకుంటున్నారు. పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుక తోక ఆడించినట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఉద్యోగులు పెచ్చుమీరిపోతున్నారు.. తగ్గేదేలే అంటూ లంచాలకు పాల్పడుతున్నారు.
అయితే అదేస్థాయిలో వదిలేదేలే అంటూ ఏసీబీ అధికారులు వరుస దాడులు చేసి అవినీతి ఉద్యోగుల భరతం పడతున్నారు. అయినప్పటికీ లంచావతారులు భయపడేదేలే అంటూ పేట్రేగిపోతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ సర్కార్‌లో పాలన గాడి తప్పిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన ‘ప్రజాపాలన’ ఇదేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ పాలన వచ్చిందంటే ఎవరికైనా అలుసే. ఎలాంటి అవినీతి పనులైనా ఎంచక్కా లైన్ క్లియర్ అవ్వాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో పైరవీలకు పెద్దపీట వేసినట్టే అని సర్వత్రా తెలియని వారుండరు. అదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సైతం ఫ్రీహ్యాండ్ వచ్చినట్లే అని సంబురపడుతున్నారు. దీంతో అవినీతి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అధికారులు, ఉద్యోగులు లంచాలకు పాల్పడుతున్నారు. కనీసం కలెక్టరేట్ అనే భయం కూడా లేకుండా ఐడీవోసీలోనే ఓ హార్టికల్చల్ అధికారి ఏకంగా రూ.లక్షకు పైగా లంచం తీసుకుని మరీ ఏసీబీకి చిక్కారు. ఏడాదిలోపే 15 మంది ఉద్యోగులు ఏసీబీ ట్రాప్‌లో పడి ఊచలు లెక్కిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అధికారులకు ఎలాంటి భయం లేదంటే కాంగ్రెస్ పాలనకు ఇంతకన్నా ఉదాహరణ ఏమీ చెప్పనక్కర్లేదు.
లంచాలకు మరిగిన ఉద్యోగులు పోటీపడి మరీ ఏసీబీకి చిక్కుతున్నారు. ఏడాదిలోపే 15 మంది అడ్డంగా దొరికిపోయారు. అటు కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు తలోదారిగా ఉంటే.. ఇటు ఉద్యోగులు ఇష్టానుసారంగా లంచాలకు మరిగి బరితెగిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు వచ్చినా సరిపోక లంచాలకు తెగబడుతున్నారు. ఎన్నిసార్లు ఏసీబీ అధికారులు దాడి చేసినా కనీసం చీమ కుట్టినట్లుగా లేకపోవడం విశేషం.
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఫిబ్రవరి 28: బిల్లు చెల్లింపు విషయంలో పాఠశాల హెచ్ఎం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో ఓ కరాటే మాస్టర్ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు.
ఈ క్రమంలో అతడికి సంబంధించి రూ.30 బిల్లు ప్రభుత్వం నుంచి మంజూరైంది. ఆ బిల్లును సదరు కరాటే మాస్టర్‌కు చెల్లించకుండా పాఠశాల హెచ్ఎం తాటి రవీందర్ ఇబ్బందులకు గురిచేయడంతోపాటు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనికి ఒప్పుకున్న కరాటే మాస్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పన్నిన పథకం ప్రకారం.. పాఠశాలలో హెచ్ఎం రవీందర్ కరాటే మాస్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెచ్ఎం రవీందర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.
ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు పీడిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, టీఏలు, పీఎఫ్‌లు కాక బోలెడు సొమ్ములు పెండింగ్‌లో ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలోనే ఉద్యోగులు అవినీతికి అలవాటు పడుతున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ఘటనలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వచ్చేది ముప్పై వేలు అయితే అందులో రూ.20 వేలు లంచం అడిగారు. మొదటి నుంచీ ఉన్న అలవాటు మీద కొంతమంది లంచాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ అవినీతి జాడ్యం పోవాలి. బాధితులు ధైర్యం చేసి ఏసీబీ అధికారులను సంప్రదించాలి. ఫోన్లో లంచం అడిగినా తప్పే. కాల్ రికార్డును పరిశీలిస్తాం. ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇబ్బంది పెట్టినా 9154388981 నెంబర్‌కు కాల్ చేసి చెప్పండి. బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతాం.
– రమేశ్, ఏసీబీ డీఎస్పీ, ఖమ్మం