Good Friday | ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని చింతలపాడు క్రైస్తవ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మానవాళి రక్షణ కోసం క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ 40 రోజులుగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ఉపవాస దీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. క్రీస్తు మరణాన్ని గుర్తుచేసుకుంటూ చర్చి గంటలు మోగించారు.
ఈ సందర్భంగా మాదారం ఏజీసీఎం చర్చి పాస్టర్ ఎం.ఏలియా మాట్లాడుతూ… మానవాళి కోసం యేసు ప్రభు చేసిన కృషి, త్యాగాలను వివరించారు. క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు క్రైస్తవ మార్గంలో నడుస్తున్న వారికి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్పిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సత్య మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
మనిషి చనిపోయేంతవరకు యేసు ప్రభు బోధనలను స్మరించుకుంటూ సమాజానికి, ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండాలో తెలిపారు. అదేవిధంగా మండలంలోని అన్ని క్రీస్తు ప్రార్థన మందిరాలలో చర్చి పాస్టర్లు భక్తులకు గుడ్ ఫ్రైడే విశిష్టతను భక్తులకు వినిపించారు. అనంతరం ఒకరికొకరు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అన్నీ చర్చిలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పలువురు యువతీ, యువకులు ఆలపించిన క్రైస్తవ గేయాలు అలరించాయి.