‘యేసయ్యా.. మీ త్యాగం అజరామరం.. మీ మార్గం అనుసరణీయం..’ అంటూ క్రైస్తవ బోధకులు క్రీస్తు త్యాగాలను విశ్వాసులకు బోధించారు. మనుషులు చేసిన పాపాలకు బలిగా తన ప్రాణాన్ని అర్పించి సిలువ మరణం పొందిన రోజుగా క్రైస్తవ భక్తులు జరుపుకునే గుడ్‌ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రార్థనా మందిరాల్లోనూ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తుకు మరణశిక్ష విధించే క్రమంలో శిలువ మార్గపు సన్నివేశాలను ప్రదర్శించారు.
క్రైస్తవ భక్తులు వాటిని చూసి కంటతడి పెడుతూ ప్రార్థనలు చేశారు. అలాగే, గత 40 రోజులుగా కొనసాగించిన ఉపవాస దీక్షలను శుక్రవారం విరమించారు. చర్చీలకు తరలివెళ్లి ప్రత్యేక పార్థనలు ఆచరించారు. ఈ సందర్భంగా క్రైస్తవ బోధకులు బైబిల్ వాక్యాలను ఉపదేశించారు. గుడ్‌ఫ్రైడే అనేది.. దేవుడికి మానవుడికి.. అలాగే, మానవుడికి మానవుడికి మధ్యగల ప్రేమ బంధాన్ని చాటుతుందని బోధించారు. మానవులందరూ పాపాలను దరిచేరనీయకూడదని, ప్రేమతో జీవించాలని, దేవుడి మార్గాన్ని అనుసరించాలని ఉపదేశించారు.
-నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 18