నాడు సర్కారు బడులున్నా విద్యార్థులు లేక వెలవెలబోయాయి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక.. వేళకు పాఠశాలలు తెరుచుకోక.. పుస్తకాలు సరిగా లేక.. ఒకవేళ అన్నీ సరిగా ఉన్నా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థంకాక విద్యార్థులు సతమతమయ్యారు. బడి భవనాల పైకప్పులు దెబ్బతిని వర్షాలకు కురిసేవి. తలుపులు, కిటికీలు లేక కొన్ని పాఠశాలలు బూత్ బంగ్లాలను తలపించేవి. ఇవన్నీ కళ్లారా చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ఇష్టపడేవారు కారు. అప్పు చేసైనా ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేవారు. స్వరాష్ట్రం సిద్దించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారు. కొత్త తరగతి గదులు నిర్మించారు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం అమలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల చదువుల కోసం గురుకులాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే బడుల్లో ఇంగ్లిష్ మాధ్యమం అమలు చేసేందుకు , మౌలిక వసతులు కల్పించేందుకు ‘మన ఊరు -మన బస్తీ/మనబడి’ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యాదినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో విద్యారంగ విజయాలపై ప్రత్యేక కథనం.
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 19: తల్లిదండ్రులు ప్రభుత్వ బడులంటే ఈసడించుకునే రోజులు పోయాయి.. సర్కారు బడులకు మంచి రోజులొచ్చాయ్.. సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆంగ్ల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునేందుకు గురుకులాలను బలోపేతం చేశారు. సర్కార్ బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు- మన బడి/మన బస్తీ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో విద్యా వెలుగులు నింపుతున్నారు.
అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా 317 జీవో అమలు చేస్తున్నది. జోనల్ విధానంలో సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు ‘జీరో టీచర్స్’ స్కూల్స్‌లో పోస్టింగ్స్ వచ్చాయి. ఉపాధ్యాయులు లేని స్కూల్స్‌తోపాటు, సబ్జెక్ట్‌ల పరంగా అవసరమైన స్కూల్స్‌లో విద్యాశాఖ ఉపాధ్యాయులను కేటాయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు.. ఇలా 25 రకాల కేటగిరీల్లో బదిలీల ప్రక్రియ జరిగింది. కొన్ని స్కూల్స్‌కు డిప్యూటేషన్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల స్థానంలోనూ ఇప్పుడు రెగ్యులర్ టీచర్లు నియమితులయ్యారు.
ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ వీపీ గౌతమ్, అనుదీప్ ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వయంగా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటున్నారు. తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. బోధనలో ప్రభుత్వం మూస పద్ధతికి స్వస్తి పలికింది. అప్లికేషన్ మోడల్ రూపంలో ఉండేలా పాఠ్యపుస్తకాలను సిద్ధం చేసింది. పరీక్షలను సమ్మెటివ్-1, 2 పద్ధతిలో నిర్వహిస్తున్నది. గుణాత్మక విద్యకు ప్రాధాన్యమిస్తున్నది.
ఉమ్మడి పాలనలో ఖమ్మం జిల్లా పరిధిలో కేవలం రెండు బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడా సంఖ్య 22కు చేరుకున్నది. గతంలో గురుకులాల్లో విద్య పదోతరగతి వరకే ఉండేది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 12 బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ కోర్సులు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి గురుకులాల్లో హౌస్ మాస్టర్, హౌస్ పేరెంట్ వ్యవస్థ అమలవుతున్నది. విద్యాలయాల్లో విద్యార్థులకు విద్యతో పాటు మార్షల్ ఆర్ట్స్, లలిత కళలు, యోగా, క్రీడలు, కరాటేపై ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు నిపుణులు శిక్షణ ఇస్తారు.
ఉమ్మడి పాలనలో ఖమ్మం జిల్లా పరిధిలో కేవలం ఎనిమిది ఎస్సీ గురుకులాలు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రం వచ్చాక ఆ సంఖ్య ఇప్పుడు 14కి చేరింది. వీటితో పాటు రెండు ప్రతిభా కళాశాలలు రెండు, ఒక మహిళా డిగ్రీ కళాశాల, ఒక వృత్తి విద్యా కోర్సు కళాశాల అందుబాటులోకి వచ్చాయి.
12 నుంచి 18 ఏళ్ల బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం 13 రకాల వస్తువులతో కూడిన హైజిన్ కిట్స్ అందిస్తున్నది. ఒక్కో బాలిక ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఏడాదికి రూ.1,600 వెచ్చిస్తున్నది.
ఉమ్మడి పాలకులు ప్రభుత్వ విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. మన ఊరు- మన బడి పథకంలో భాగంగా గతేడాది నుంచి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్నది. ప్రపంచీకరణ, పోటీతత్వం నేపథ్యంలో ప్రతి విద్యార్థి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లం నేర్చుకోవడం తప్పనిసరి. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకుంటే అది ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సంకల్పంతోనే సర్కార్ ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల విద్యను అమలు చేస్తున్నది. దీంతో గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
సర్కార్ బడుల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన అందించేందుకు ప్రభుత్వం డిజిటల్ బోర్డులు అందించింది. ప్రతి బడికి ఒక ప్రొజెక్టర్, కంప్యూటర్ సమకూర్చింది. ఉపాధ్యాయులు టెక్నాలజీ జోడించి పాఠాలు బోధించడంతో విద్యార్థులకు సులువుగా అర్థమవుతున్నది. ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా సర్కార్ ప్రభుత్వ బడులకు డిజిటల్ గ్రీన్ చాక్ బోర్డులు సమకూర్చింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ బోధన అందుతున్నది. మున్ముందు 6, 7వ తరగతుల విద్యార్థులకూ డిజిటల్ బోధన అందనున్నది.
‘మన ఊరు- మన బడి’ అమలులో ఖమ్మం జిల్లా మిగతా 32 జిల్లాల కంటే అగ్రస్థానంలో ఉంది. మొదటి దశకు జిల్లావ్యాప్తంగా 426 స్కూల్స్ ఎంపిక కాగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు సర్కార్ రూ.60 కోట్లు వెచ్చించింది. ఇప్పటి వరకు 102 బడుల్లో 100శాతం పనులు పూర్తయ్యాయి. ఏడు ప్రభుత్వ శాఖల ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పాఠశాలల్లో అత్యాధునిక టాయిలెట్లు, కూర్చోడానికి బెంచీలు, విద్యుద్దీకరణ, ఫర్నీచర్, డైనింగ్ హాల్, గ్రీనరీ, గ్రీన్ చాక్ బోర్డులు అందుబాటులోకి వచ్చాయి.