రఘునాథపాలెం, జూన్ 17: విద్యార్థులు విద్యాబుద్ధులు అందించే ఆ బడి పశువులకు కొట్టమైంది. సెలవుల్లో అయితే ఏకంగా నిలయంగా మారుతోంది. ఉపాధ్యాయుల పట్టింపులేకపోవడం.. పక్కింటి పాడి రైతుకు వరంగా మారింది. పాఠశాల ఉన్నప్పుడు విద్యార్థులతో కనిపించే ఆ పాఠశాల.. సెలవుల్లో మాత్రం పశువుల పాకగా దర్శనమిస్తోంది. పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడల్లా పక్కింటి పాడి రైతు ఆ పాఠశాలను ఎంచక్కా తన గేదెలకు ఆశ్రయంగా వినియోగించుకుంటున్నాడు. అయితే, పాఠశాల గేటుకు తాళం వేయకపోవడంతోనే ఈ తంతు నిత్యకృత్యంగా జరుగుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఖమ్మం నగర పరిధిలోని గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో కనిపించింది. ఆదివారం వారంతం, సోమవారం బక్రీద్ కావడంతో పాఠశాలకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఆ పాఠశాల పక్కన నివాసం ఉండే ఓ పాడి రైతు తన పశువులను ఈ స్కూలు ప్రాంగణంలోని చెట్ల కింద కట్టేసి ఉంచుతున్నాడు. బడి పిల్లలు ఉండే పాఠశాల ప్రాంగణంలో పశువులు దర్శనమిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.