ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను నమోదు చేశారు. మంగళవారం విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పాస్ పర్సంటేజీ పెరిగింది. ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో జనరల్ విభాగంలో ఖమ్మం జిల్లా మూడో స్థానంలోనూ, ద్వితీయ సంవత్సరంలో ఐదో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత 3 శాతం, ప్రథమ సంవత్సరంలో 8 శాతం శాతం పెరిగింది. అనేక ఏళ్లుగా అద్భుత ఫలితాలను సాధిస్తూ జిల్లా విద్యార్థులు ఈ ఏడాది కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ఫస్టియర్, సెకండియర్లలో జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. ఎప్పటిలాగానే బాలికలే తమ హవాను కొనసాగించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో సైతం బాలురతోపాటు బాలికలు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ఫస్టియర్లో జిల్లా ఉత్తీర్ణత శాతం 71.15 కాగా అందులో బాలికలు 77.89 శాతం ఉత్తీర్ణతశాతం సాధించారు. బాలురు 64.51 శాతంతో సరిపెట్టుకున్నారు. సెకండియర్లో జిల్లా ఉత్తీర్ణత శాతం 77.69 శాతం కాగా.. అందులో బాలికలు 83.13 శాతం, బాలురు 72.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ వివరాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి కే.రవిబాబు వెల్లడించారు.
ఇంటర్ ఫస్టియర్ (జనరల్) ఫలితాల్లో 71.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో 15,584 మంది విద్యార్థులకుగాను 11,088 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 7,851 మందికిగాను 5,065 మంది; బాలికలు 7,733 మందికిగాను 6,023 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 2,253 మందికిగాను 1,388 మంది ఉత్తీర్ణులయ్యారు. 61.61 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సెకండియర్ (జనరల్) ఫలితాల్లో 14,876 మంది విద్యార్థులకుగాను 11,557 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 77.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 7,346 మందికిగాను 5,297 మంది పాసై 72.10 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. బాలికల్లో 7,530 మందికిగాను 6,260 మంది పాసై 83.13 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఖమ్మం జిల్లా ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఒకేషనల్ విభాగంలో 2,043 మందికిగాను 1,439 మంది ఉత్తీర్ణులయ్యారు. 70.44 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.
జోనల్ పరిధిలోని గురుకులాల్లో ఫస్టియర్లో 1,467 మందికిగాను 1,109 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 1,460 మందికిగాను 1,279 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ వివరాలను జోనల్ ఆఫీసర్ స్వరూపరాణి తెలిపారు.
కేజీబీవీల్లో ఫస్టియర్లో 709 మందికిగాను 557 మంది పాసై 79 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 661 మందికిగాను 584 మంది పాసై 88 శాతం సాధించారు. ఈ వివరాలను జీఈసీవో తులసి వెల్లడించారు.
కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఏప్రిల్ 22:ఇంటర్ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా విద్యార్థులు మొదటి సంవత్సరంలో 65.96 శాతం, ద్వితీయ సంవత్సరంలో 65.65 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫస్టియర్ జనరల్ విభాగంలో మొత్తం 3,028 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,570 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 4,184 మంది పరీక్షలు రాయగా 2,944 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో 860 మందికిగాను 402 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. 1,179 మంది బాలికలకుగాను 863 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఫస్టియర్లో 3,888 మంది బాలురు పరీక్ష రాయగా 1,973 మంది ఉత్తీర్ణత సాధించారు. 5,366 మంది బాలికలు పరీక్షలు రాయగా 3,807 మంది ఉత్తీర్ణత నమోదు చేశారు. సెకండియర్ జనరల్ విభాగంలో మొత్తం 2,996 మంది బాలురు పరీక్ష రాయగా 1,855 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 4,083 బాలికలు పరీక్షలు రాయగా 3,190 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 763 మంది బాలురకుగాను 495 మంది ఉత్తీర్ణులయ్యారు. 1024 మంది బాలికలకుగాను 882 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 7,079 మంది పరీక్షలు రాయగా 5,045 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,787 మంది పరీక్షలు రాయగా 1,377 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో జనరల్ విభాగంలో భద్రాద్రి జిల్లా 9వ స్థానంలో, ఒకేషనల్లో 10వ స్థానంలో నిలిచింది. ఈ నెల 23 నుంచి 30 వరకూ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, జూన్ 3 నుంచి 6 వరకు పరీక్షలు ఉంటాయని డీఐఈవో తెలిపారు.