ఖమ్మం, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ నాలుగు లేబర్ కోడ్లు దేశంలోని కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ నాలుగు చట్టాలను రద్దు చేసేదాకా విశ్రమించకపోరాడుతామని స్పష్టం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే ఆ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, పని గంటలను 12 గంటలకు పెంచే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాలు బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది.
ఈ సమ్మెకు బీఆర్ఎస్ నేతలు, దాని అనుబంధ కార్మిక సంఘాల నాయకులతోపాటు వివిధ పార్టీల, సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన సమ్మెలో వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల, రైతుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు దారాదత్తం చేస్తోందని దుయ్యబట్టారు. కార్మికుడికి కష్టం వస్తే సమ్మె చేసే అవకాశం లేకుండా చేస్తోందని, సంఘాలు పెట్టుకునే విధానాన్ని కాలరాస్తోందని, ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశాలను రద్దుచేస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులకు గొడ్డలిపెట్టుగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రధాని మోదీని గద్దె దించేవరకూ విశ్రమించబోమని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక సమ్మె సక్సెస్ అయింది. సమ్మెలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీల నేతలు, వాటి అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని మండలాల్లోనూ నేతలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. సమ్మె కారణంగా జిల్లాలో దుకాణదారులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆటోలు, బస్సులు బంద్ అయ్యాయి. ఉదయం వేళలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార సముదాయాలు మూతబడ్డాయి.