రఘునాథపాలెం, జూన్ 8: గ్యాస్ సిలిండర్ ధర మరోమారు పెరిగింది. ప్రతి సిలిండర్‌పై రూ.29 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలను ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న వంట గ్యాస్ ధరతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. శనివారం అర్ధరాత్రి రూ.29 పెంచడంతో గత మూడు నెలల కాలంలోనే రెండుసార్లు పెంచినట్లయింది.
మొదట మార్చిలో గ్యాస్ సిలిండర్‌పై రూ.60 ధర పెంచిన కేంద్రం.. తాజాగా మరోసారి రూ.29 పెంచింది. దీంతో వంట గ్యాస్ ధర ప్రస్తుతం రూ.973కు చేరింది. వంట గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది. దీంతో కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉందని ప్రజలు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఖమ్మం జిల్లాలో 34 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సుమారు 4.20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మూడు నెలల క్రితం సిలిండర్ ధర రూ.60 పెరగడంతో ధర రూ.944కు చురింది. తాజాగా మరోసారి రూ.29 పెంచడంతో సిలిండర్ ధర రూ.973కు చేరింది. ఇదిగాక డెలివరీ పేరుతో దీంతో జిల్లా ప్రజలపై ప్రతి నెలా సుమారు రూ.1.25 కోట్లు అదనపు భారం పడనుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే సిలిండర్ అందిస్తామని ప్రకటించినా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. మహాలక్ష్మి పథకం కింద ఖమ్మం జిల్లాలో 2 లక్షల పైచిలుకు మందికి రూ.500కు సిలిండర్ అందిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించినా చాలామంది లబ్ధిదారులకు చేరలేదు.
నెలలు గడుస్తున్నప్పటికీ ఈ పథకం నగదు మాత్రం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం లేదు. గ్యాస్ సబ్సిడీ విషయమై వినియోగదారులు అటు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల చుట్టూ కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. సరైన సమాధానమూ లభించడం లేదు. ఇదిగాక రవాణా చార్జీలు, డెలివరీ పేరుతో రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఒక సిలిండర్ బుక్ చేసి ఇంటికి చేరుకునే సరికి పెరిగిన ధరతో చూస్తే రూ.1,025 అవుతోంది. పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు రవాణా చార్జీలతో మరికొంత నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కేంద్ర ప్రభుత్వం మాటిమాటికీ గ్యాస్ ధరలు పెంచుతూ పోతుంటే కట్టెల పొయ్యే దిక్కయ్యేట్లు ఉంది. కట్టెల ధరలు కూడా పెరిగాయి. ఇలా అయితే పేదలు ఎలా బతికేది. గత నెలనే ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.29 పెంచింది. పెంచిన ధరలు పేద, మధ్య తరగతి ప్రజలపైనే భారం పడుతుంది. ఏ ధర పెరిగినా వాటి ప్రభావం ఇతర వాటిపై పడుతోంది.
-గుగులోతు పార్వతి, పాండురంగాపురం, ఖమ్మం
వంట గ్యాస్ ధరలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. మూడు నెలల కాలంలోనే రెండుసార్లు పెంచారు. సిలిండర్ ధరను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పెంచడమే తప్ప తగ్గించినది లేదు. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరలు మాలాంటి పేదలపై ఆర్థిక భారం మోపుతుండగా వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచి మరింత భారాన్ని వేస్తున్నారు. పెరిగిన ధరలతో అప్పులు చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. కేంద్రం ఇలా గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతే నిరుపేదలు బతకడం కష్టమే.
-ఆవుల జగదాంబ, 2వ డివిజన్, ఖమ్మం