హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఎస్ఐ, సీఐ, ఏఈఎస్‌ల బదిలీల వ్యవహారం కొలిక్కి రావడంలేదు. సాధారణంగా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే బదిలీల ప్రక్రియ మూడు నెలల నుంచి కొనసాగడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 287 మంది సీఐలలో 230 మందిని, 475 మంది ఎస్ఐలలో 340 మందిని, 54 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లలో 26 మందిని బదిలీ చేయాల్సి ఉన్నది. బదిలీల ప్రతిపాదనలు, పోస్టింగులు అన్నీ సిద్ధమైనా ఎవరి ఆధీనంలో నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. డివిజన్ పరిధిలోనా? ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) పరిధిలోనా? అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం వచ్చేవరకు బదిలీల జాబితా విడుదలయ్యే అవకాశాలు లేవని కమిషనర్ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఒక డిప్యూటీ కమిషనర్ (డీసీ) పరిధి నుంచి మరో డీసీ పరిధికి బదిలీ చేసేలా కమిషనర్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ముగ్గురు మంత్రులు మాత్రం ఈఎస్ పరిధిలోనే బదిలీలు జరుగాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఎస్ఐ, సీఐ బదిలీలు కమిషనర్ పరిధిలో ఉన్నందున అక్కడే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి ఆ ఫైల్‌ను కమిషనర్ కార్యాలయానికే తిప్పి పంపినట్టు ప్రచారం జరుగుతున్నది.
డివిజన్ మార్చాల్సిందే
8 ఎఫ్ నిబంధనతో కానిస్టేబుళ్లను దూర ప్రాంతాలకు తరలించారు. అదే తరహాలో ఒక డివిజన్లో పనిచేసిన సీఐ, ఎస్ఐలను పూర్తిగా మరో డివిజన్ కు బదిలీ చేయాలని కమిషనర్ కార్యాలయం ప్రతిపాదించినట్టు సమాచారం. ఇలా చేస్తే స్థానిక పరిచయాలు, రాజకీయ పైరవీలు, పాత సంబంధాలు తెగిపోతాయని, అక్రమాలకు అవకాశం తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. బదిలీల ఉద్దేశమే ఒకే ప్రాంతంలో ఎకువకాలం ఏర్పడిన ప్రభావాన్ని తొలగించడం కాబట్టి డివిజన్ మార్పు తప్పనిసరి కావాలని కమిషనర్ కార్యాలయం అభిప్రాయ పడుతున్నట్టు సమాచారం. కానిస్టేబుళ్ల మీద కఠిన నిబంధనలు అమలు చేసి, అధికారులను స్వేచ్ఛగా వదిలి వేస్తే సిబ్బందిలో అసంతృప్తి రగులుతుందని వాదిస్తున్నది. ఈ ప్రతిపాదనలకు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి సైతం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
74 ఫోకల్ పోస్టులే కేంద్రబిందువా?
వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కల్తీ కల్లు, ఎంఆర్పీకి మించి మద్యం విక్రయాలు ఎకువగా ఉండటంతో, అకడి పోస్టింగ్‌లకు అధిక ప్రాధాన్యం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతున్నది. అక్కడి ఫోకల్ పోస్టుల కోసం పెద్దఎత్తున పైరవీలు సాగుతున్నాయని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం శాఖలో 74 ఫోకల్ పోస్టులు ఉన్నట్టు అంచనా. ఈ పోస్టుల కేటాయింపే మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా మారిందని సమాచారం. ఈఎస్ పరిధిలోనే బదిలీలు జరిగితే ఈ పోస్టులపై తమ ప్రభావం చూపడం సులభం అవుతుందని, అందుకే ఆ విధానాన్ని కొనసాగించాలని కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోకల్ పోస్టుల కేటాయింపులో భారీగా డబ్బులు చేతులు మారే అవకాశమున్నదని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గత జూన్‌లో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ల స్థాయిలో మొత్తం 68 మంది ఉన్నతాధికారుల బదిలీలు జరిగినప్పుడు కూడా ఫోకల్ పోస్టుల కోసం మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారుల సిఫార్సు లేఖలు పెద్దఎత్తున వచ్చినట్టు ప్రచారంలో ఉన్నది. ఆ పోస్టింగ్‌లలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.