మామిళ్లగూడెం, జూన్ 7: కోణార్క్ రైళ్లో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్-1 సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి రవాణాపై నిఘా పెరగడంతో అక్రమారులు గంజాయిని రైళ్లలో తరలిస్తున్నారని తెలిపారు. రైళ్లలో గంజాయి తరలిస్తున్నారన్న విషయాన్ని పసిగట్టి రైళ్లలో తనిఖీలు మరింత పెంచామని తెలిపారు. ఈ నేపథ్యంలో కోణార్ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా 23 కిలోల ఎండు గంజాయి గుర్తించామని తెలిపారు.
ఒరిస్సా నుంచి అక్రమంగా గంజాయిని కోణార్లో తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకరి రమేష్తో పాటు హరీష్, వెంకట్, హన్మంతరావు, సుధీర్, విజయ్, బేబీ తనిఖీలు నిర్వహించారు. గంజాయిని తూకం వేయగా 23 కేజీలుగా ఉన్నదని, దీని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఏఈఎస్ తిరుపతి అభినందించారు.
ఖమ్మం నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ స్టేషన్-2 అధికారులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న చేకూరి శ్రీను మహబూబాబాద్ పట్టణం నుంచి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసిన 100 గ్రాముల గంజాయిని విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం, సెల్ఫోన్ స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.