చాక్‌పీసులు, చార్టులకు నిధులు కేటాయించలేని దుస్థితిలో సర్కారు పాఠశాలలు నడుస్తున్నాయి. బడులు మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పాపానపోలేదు. పాఠశాల ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులతో చాక్‌పీసులు, చార్టులు, పరీక్షల నిర్వహణకు పేపర్లు, రిజిస్టర్లు, డస్టర్లు సమకూర్చుకుంటున్నారు.
ఇక టాయిలెట్లను శుభ్రం చేయించాలన్నా పనివాళ్లకు పైసా చెల్లించలేని స్థితికి స్కూల్స్ చేరుకున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం వీటన్నింటికి చరమగీతం పాడగా, తాజాగా కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆ సమస్యలు వెక్కిరిస్తున్నాయి. 2024-25 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలకు వార్షిక నిర్వహణ నిధులు ఇప్పటికీ ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో జమ కాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతున్నది.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 18: కేవలం ప్రచార ఆర్భాటాల కోసం రూ.కోట్లు కుమ్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. బలవంతంగా ఉపాధ్యాయులతో కార్యక్రమాలను నిర్వహించమని ఒత్తిడి తెస్తూ కంటితుడుపుగా విద్యాసంవత్సరానికి సంబంధించిన వార్షిక నిర్వహణ నిధులను విడుదల చేస్తున్నట్లు జీవో ఇచ్చినా నగదు మాత్రం బ్యాంక్ ఖాతాల్లో పడలేదు.
2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలలు గడుస్తున్నా రూపాయి కూడా జమ కాలేదు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లో 50 శాతం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ విడుదల చేస్తున్నది. 2023-24 విద్యాసంవత్సరంలో మొదటివిడతగా రూ.34.95 కోట్లను జూన్‌లోనే విడుదల చేసింది. గత సంవత్సరం, ఈ విద్యాసంవత్సరంలో విడుదలైన నిధుల కేటాయింపుల గురించి ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన 1,299 పాఠశాలల్లో 1,05,724 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి ఎలాంటి తోడ్పాటును అందించకపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ తగ్గింది. విద్యార్థులకు అందించే సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తొలగించడం, అవసరమైన సదుపాయాలను కల్పించే విషయంలో సమగ్రశిక్ష అభియాన్ నిధులు కేటాయించకపోవడంతో సర్కార్ బడులు సమస్యలతో సహవాసం చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా
ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక నిధులతో పాఠశాలలో వసతులు కల్పించాలి. ఇంటర్నెట్, కంప్యూటర్ల సర్వీసింగ్, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వీలుగా గ్రంథాలయాల్లో విజ్ఞాన పుస్తకాలు, దినపత్రికలు, మాసపత్రికల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టేషనరీ, టీఎల్ఎం(టీచర్ లెర్నింగ్ మెటీరియల్), క్రీడా సామగ్రి, పరీక్షల నిర్వహణకు పేపర్ల కొనుగోలుకు నిధులను వినియోగించుకోవాలి.
నిధులు విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయులు తలా కొంచెం సర్దుబాటు చేసుకుంటూ సొంత నిధులతో స్కూల్ నిర్వహణ సాగిస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని ఉపాధ్యాయులు వాటిని తిరిగి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో ప్రతి పైసాను పాఠశాల యాజమాన్య అభివృద్ధి కమిటీ ద్వారా తీర్మానం చేసి పారదర్శకంగా ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగ యుటిలైజేషన్ పత్రాలను డీఈవోల ద్వారా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే మూడు జెండాపండుగలు నిర్వహించారు. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాల పేరిట పాఠశాలల్లో జెండా ఎగురవేశారు. వీటి నిర్వహణ భారంగా మారింది. నిధుల జాప్యం పాఠశాల నిర్వహణకు ఆటంకంగా తయారైంది. ఒక్క కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ గ్రాంట్, స్టిచ్చింగ్, ఎంఆర్సీ గ్రాంట్, కాంప్లెక్స్ గ్రాంట్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, డైట్ చార్జెస్, సెల్ఫ్ డిఫెన్స్ గ్రాంట్ సకాలంలో ఇవ్వాల్సి ఉంది.
ప్రతి ఏడాది రెండుసార్లు కాంపోజిట్ స్కూల్ గ్రాంటు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు మా పాఠశాలకు కాంపోజిట్ స్కూల్ గ్రాంటు రాలేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 50 శాతం నిధులు అంటే.. రూ.25 వేలు రావాల్సి ఉంది. స్కూల్ గ్రాంటు రాకపోవడంతో పాఠశాల అభివృద్ధికి అవసరమైన చాక్‌పీస్, డస్టర్, తెల్లకాగితాలు, పాఠశాలకు అవసరమైన నిత్యావసరాలు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. విద్యాశాఖ స్కూల్ గ్రాంట్‌ను మంజూరు చేసిందని చెబుతున్నా తమ ఖాతాలో ఇంతవరకు జమ కాలేదు.
– జగపతి, హెచ్ఎం, నాచారం జడ్పీ ఉన్నత పాఠశాల
దమ్మపేట మండలానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఇంతవరకు రాలేదు. మండలంలో 8 జడ్పీ ఉన్నత, 58 ప్రైమరీ, 25 యూపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. నిధులు సకాలంలో రాకపోవడంతో పాఠశాలలకు అవసరమైన నిత్యావసరాలకు హెచ్ఎంలే సొంత డబ్బులు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిందని చెబుతున్న గ్రాంటు హెచ్ఎంల ఖాతాల్లో ఇంకా జమ కాలేదు.
– కీసరి లక్ష్మి, ఎంఈవో, దమ్మపేట
పాఠశాల నిర్వహణలో నిధులు లేక బోధనలో ఆటంకాలు ఏర్పడకుండా సొంత నిధులతో చాక్‌పీసులు, చార్ట్‌లు, ఇతర సామగ్రిని సమకూర్చుకున్నాం. పాఠశాల నిర్వహణలో కీలకమైన స్కూల్ గ్రాంట్ విడుదలలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.
– గుడిపూడి శ్రీనివాసరావు, హెచ్ఎం, యూపీఎస్ వేణుగోపాలనగర్
పాఠశాలలో ఇంగ్లిష్‌తోపాటు ఉర్దూ మీడియం కూడా ఉంది. విద్యార్థులు 386 మంది వరకు వివిధ తరగతుల్లో చదువుతున్నారు. రోజువారీ నిర్వహణకు నిధులు సమస్యగా మారింది. పాఠశాలలోని టీచర్ల సహకారంతో అందరం కలిసి అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాం. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేస్తే ఉపశమనం ఉంటుంది.
– శాంత, హెచ్ఎం, రిక్కాబజార్ పాఠశాల
పాఠశాలలు అంటేనే సర్కారుకు చిన్నచూపు. అసలు నిధులు ఇవ్వరు. ఇచ్చినా సమయానికి రావు. దీనివల్ల టీచర్లే చేతినుంచి డబ్బులు పెట్టుకుంటున్నారు. చాక్‌పీసులు అయితే కొంటారు. ఆట వస్తువులు ఎలా కొనాలి. పాతవి, ఉన్నవాటితో ఆడిస్తున్నాం. ఒక్కోసారి విద్యాసంవత్సరం అయిపోయాక గ్రాంటు వస్తుంది. అది ఎవరికీ ఉపయోగపడదు.
– ఎన్.కృష్ణ, అశ్వాపురం స్కూల్ టీచర్, యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ
పాఠశాల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారింది. పాఠశాలను అద్దె గదిలో నడుపుతున్నాం. దీనికి నెలకు రూ.1,500 అద్దె కూడా సొంత నగదును చెల్లిస్తున్నాం. ఇవికాకుండా అదనంగా నెలకు మరో రూ.1,500 వరకు ఖర్చు వస్తున్నది. ప్రభుత్వం నిర్వహణతోపాటు పాఠశాలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
– రాంబాబు, హెచ్ఎం, రజక వీధి పీఎస్