ఖమ్మం మయూరిసెంటర్, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న ఉద్యమానికి గురువారం సంఘీభావం తెలిపి ప్రసంగించారు. సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదంతోపాటు అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తుచేశారు. విలీన ప్రక్రియను వేగవంతం చేస్తున్న క్రమంలో అసంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆ విలీన ప్రక్రియను పక్కనపెట్టిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకిచ్చిన హామీలను అమలుచేయడంలో రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని విమర్శించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా దోచుకొని దాచుకునే పనిలో పూర్తి బిజీలో ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని గుర్తుచేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం లభించేంత వరకు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా కల్పించారు. బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, తాజూద్దీన్, సతీశ్, వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్, మేరుగు రవీంద్రనాథ్, సత్యం, నల్లగట్టు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.