భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ) : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. వ్యవసాయశాఖ రైతుల జాబితాను సిద్ధం చేసి నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేస్తున్నది. భద్రాద్రి జిల్లాలో 2018 నుంచి తెలంగాణ సర్కారు రైతుబంధు సాయం అందిస్తున్నది. యాసంగి సీజన్‌కు సంబంధించి డబ్బులు జమ చేస్తే రైతులకు పదోసారి పంట పెట్టబడి సాయం అందనున్నది. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న వారితోపాటు పోడురైతులకూ రైతుబంధు సాయం అందిస్తున్నది. ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులకు సాయం అందనున్నది. భద్రాద్రి జిల్లాలో యాసంగి రైతుబంధు సాయం రూ.204.51 కోట్లు మంజూరు కాగా.. 1,34,370 మంది రైతులు రైతుబంధు సాయం అందుకోనున్నారు. బుధవారం నుంచి రైతు బంధు డబ్బులు కర్షకుల ఖాతాలో జమకానున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం యాసంగి పంటను కొనుగోలు చేయనని తెగేసి చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు అండగా నిలిచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. కరోనా కాలంలోనూ పెట్టుబడి సాయం అందించి కర్షకుల కష్టాలు తీర్చింది. దీంతో అన్నదాతలు తెలంగాణ సర్కారు జైకొడుతున్నారు.
రైతులకు మంత్రి అజయ్ శుభాకాంక్షలు
ఖమ్మం, డిసెంబర్ 27: రాష్ట్రంలో అర్హులైన 70.54 లక్షల రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని జమ చేయనుందని మంత్రి అజయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున 1.5 కోట్ల ఎకరాలకు గాను రూ.7,676.61 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో కూడా 3.28 లక్షల మంది రైతులకు రూ.363.44 కోట్లు జమ కానున్నాయన్నారు. పంటల పెట్టుబడి సాయం అందుకోనున్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. అన్నంపెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. రైతు కేంద్రంగా పాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. పంటల పెట్టుబడి సాయాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చారు. ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభం కాగానే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు రైతులందరూ రుణపడి ఉంటారు. పెట్టుబడి భారమవుతున్న పరిస్థితుల్లో రైతుబంధు సాయం అందించడం అభినందనీయం. తెలంగాణ సర్కారుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రైతుబంధు సాయం అందించడం ఇది పదోసారి. ఇప్పటివరకు నాకు రూ.50 వేలు సాయం అందింది.
– కున్సోత్ వశ్యా, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలం
అదునుకు రైతుబంధు అందుతుంది
దుక్కులు దున్ని సాగు సన్నద్ధమవుతున్న సమయంలో రైతుబంధు డబ్బులు జమ కావడం సంతోషంగా ఉంది. పంటల మార్పుపై అధికారులు మంచి సలహాలు ఇచ్చారు. పంటల మార్పిడి కూడా చేస్తున్నాం. రైతులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఎకరమున్నర ఉంది. ఇప్పటి వరకు రూ.75 వేలు సాయం అందుతుంది.
–కున్సోత్ చందర్, లక్ష్మీదేవిపల్లితండా, సుజాతనగర్ మండలం
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పంట పెట్టుబడి సాయం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే పంట పెట్టుబడి సాయం అందుతుంది. కొత్తగా పాసుపుస్తకాలు వచ్చినవారి జాబితాను తయారు చేశాం. పోడురైతులకు కూడా రైతుబంధు ఇస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో ఐదేళ్లలో రూ.1,726.86 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యింది.
–కొర్సా అభిమన్యుడు,జిల్లా వ్యవసాయధికారి