చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆనందానికి కొదువ ఉండదు. వారు చేసే ప్రతి చర్య మనల్ని సంతోషంలో ముంచెత్తుతుంది. వారికి చిన్న సుస్తి చేస్తే కన్నవారి హృదయం విలవిలలాడుతుంది. అందుకే చిన్నారులను కంటికిరెప్పలా కాపాడుకుంటారు. వారి సంపూర్ణ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డకు 10 సంవత్సరాలు వచ్చేవరకు అన్నిరకాల టీకాలను ఉచితంగా అందిస్తున్నది. ఈక్రమంలో టీకాల ప్రాముఖ్యత, వేయించకపోతే కలిగే నష్టాలు తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి.
కూసుమంచి, జూలై 2 : టీకా అనేది పిల్లలకు వజ్రాయుధం. రోగ నిరోధకశక్తిని పెంచి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. సరైన సమయంలో స్పందించకపోతే జీవితాంతం ఇబ్బంది పడతారు. మాతాశిశు సంక్షేమం కోసం 1978లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రాం ఆఫ్ ఇమ్యూనైజేషన్(ఈపీఐ)ని ప్రవేశపెట్టారు. తర్వాత 1989-90 నాటికి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంగా దశల వారీగా దేశమంతా చేపట్టారు. గర్భిణులకు, అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా టీకాలు వేస్తున్నది. పట్టణాల్లో ఆరోగ్యకేంద్రాలు, ఆసుపత్రులు, పల్లెల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల్లో టీకాలను ఉచితంగా వేస్తారు. ప్రధానంగా 12 రకాల టీకాలు పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి. టీకాలు వేయించకపోతే వచ్చే వ్యాధులు జీవితకాలం ఇబ్బంది పెడతాయి. పుట్టినబిడ్డ నుంచి 10 ఏండ్ల వరకు టీకాలు సరైన సమయంలో వేయించుకోవాలి. లేకపోతే క్షయ, రక్తహీనత, పోలియో, క్యాన్సర్, వైరల్ డయేరియా, కీళ్లవాతం, ధనుర్వాతం, తట్టు, రుబెల్లా, మెదడువాపు, కోరింత దగ్గు, రేచీకటి వంటి రోగాలు చుట్టుముడతాయి.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
గతంలో పేదింట్లో కాన్పు అంటే భయపడే పరిస్థితి. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు అయ్యేలా మందులు వేస్తున్నారు. అన్నివిధాలా ఆరోగ్యవంతులుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆశ కార్యకర్త, సెకండ్ ఏఎన్ఎం, ఏఎన్ఎంల పర్యవేక్షణలో పరీక్షలు చేపడుతున్నారు. క్రమం తప్పకుండా 102 వాహనంలో పెద్ద ఆసుపత్రిలో మాతాశిశు కేంద్రానికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు, స్కానింగ్లు తీయిస్తూ ఎప్పటికప్పుడు మందులు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు.
సబ్ సెంటర్లలోనే టీకాలు
ప్రతి వారం ఆరోగ్య ఉపకేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. మాతాశిశు పేరుతో ఒక కార్డును అందిస్తారు. దానిలో ఎప్పుడు ఏ టీకా వేయించుకోవాలనేది స్పష్టంగా ఉంటుంది. టీకాకు వచ్చిన సమయంలోనే మళ్లీ ఏ తేదీన రావాలి, అప్పుడు వేసే టీకా ఏంటీ అనేది తెలియజేస్తారు. వాటిని భద్రపరచడం కోసం ఐస్ప్యాక్స్ను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకొని పీహెచ్సీల నుంచి తీసుకెళ్తున్నారు. టీకా వేశాక పిల్లలను గమనించి కొద్ది సమయం తర్వాత పంపిస్తారు.
వయస్సు ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్
పుటిన వెంటనే బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్-బీ(0డోస్)
6 వారాలకు పెంటావాలెంట్-1, ఓపీవీ-1, ఐపీవీ-1,
రోటా వైరస్ వ్యాక్సిన్-1, పీసీవీ
10 వారాలకు పెంటావాలెంట్-2, ఓపీవీ-2,
రోటా వైరస్ వ్యాక్సిన్-2
14 వారాలకు పెంటా వాలెంట్-3, ఓపీవీ-2, ఐపీవీ-2,
రోటావైరస్ వ్యాక్సిన్-3, పీసీవీ
9 నెలలకు మిజిల్స్, జేఈ-1, విటమిన్ ఏ-1, పీసీవీ
16నుంచి 24 నెలలకు డీపీటీ, ఓపీవీ, జేఈ, మీజిల్స్,
విటమిన్ ఎ-2 (బూస్టర్)
5-6 సంవత్సరాలకు డీపీటీ, విటమిన్-ఎ 9వ డోస్
10, 16 సంవత్సరాలకు టీడీ డోస్
గర్భిణికి 12 వారాలలోపు టీడీ-1 (0.5 మిల్లీ)
గర్భిణికి 4వారాల తర్వాత టీడీ-2 (0.5 మిల్లీ)
తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినవి…
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నది. అయితే వైద్యులు ఎన్ని జాగ్రత్తలు, సలహాలు చెప్పినప్పటికీ పిల్లల సంరక్షణ విషయంలో తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత. గర్భిణులు శిశువుకు 5 సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏ టీకా దేనికి ఇచ్చారు, మళ్లీ సందర్శనకు ఎప్పుడు రావాలి, వేసిన టీకా కార్డులో నమోదు చేశారా?, కార్డును భద్రపరుచుకోవడం, నెలసరి బరువు చెక్ చేసుకోవడం. వైద్యుల సలహాలు పాటించడం తప్పనిసరిగా చేయాలి. ప్రతి టీకాకు చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి.. వైద్యులను అడిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి నెలా పరీక్షలు చేయిస్తున్నారు
మాది పేద కుంటుంబం. గర్భిణి సమయం నుంచి నేను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చూపించుకొంటున్నా. మంచిగా చూస్తున్నారు. గతం కంటే మంచి వసతులు ఉన్నాయి. సాధారణ కాన్పు అయ్యే విధంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రతి నెలలో ఒకసారి 102 వాహనంలో మా ఆశ కార్యకర్తతో ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి వెళ్లి చూపించుకొంటున్నాం. స్కానింగ్ ఉచితంగా తీసి మళ్లీ ఇంటిదగ్గర విడిచి పెడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదుకావడంతో మేము సర్కారు దవాఖానకు వెళ్తున్నాం. – సట్టు పావని, జక్కేపల్లి
మంచి వైద్యసేవలు అందిస్తున్నారు
ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. అంగన్వాడీలో పౌష్టికాహారం ఇస్తున్నారు. క్రమం తప్పకుండా సరుకులు ఇంటికే ఇస్తున్నారు. బాలామృతం, గుడ్లు, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. గర్భిణి నుంచి పిల్లలు పెద్ద అయ్యే వరకు ఇచ్చే టీకాలు చెబుతున్నారు. మాలాంటి వాళ్లకు ప్రభుత్వ ఆసుప్రతులు చాలా ఉపయోగం.
– చెరుకుపల్లి భూమిక, ఈశ్వరమాధారం
01