‘ఇందిరమ్మ పథకం’లో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక భారమవుతున్నది. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో ఆయా మండలాలకు ఇసుక రీచ్‌లను ఎక్కడో దూరంగా కేటాయించడంతో లబ్ధిదారులకు రవాణా ఖర్చులే తడిసిమోపెడవుతున్నాయి.
ఇసుక డిపోలు ఏర్పాటు చేసి అందుబాటులో ఇసుకను ఉంచాల్సిన అధికారులు ఆ సంగతే మరిచారు. దీంతో ఇదే అదునుగా భావించిన ఇసుక అక్రమ వ్యాపారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.10 వేల వరకూ డిమాండ్ చేస్తూ లబ్ధిదారులను దోచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు చేరాల్సిన ఇసుక యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్నా పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ రేట్లు విపరీతంగా పెరగడంతో లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారు.
– మామిళ్లగూడెం, సెప్టెంబర్ 4
ప్రభుత్వ కొర్రీలు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లితోపాటు ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలానికి 16,153 ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 12,094 ఇండ్లకు లబ్ధిదారులు ముగ్గులు పోశారు. ప్రస్తుతం 7,398 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో నిర్మాణం పూర్తిచేశారు. మరో 1,019 స్లాబ్‌లెవల్ వరకు నిర్మాణం జరిగింది.
అలాగే 392 ఇండ్లకు స్లాబ్ వేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం 2 ఇండ్లు మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మాణం ముగిసింది. అయితే ముగ్గులు పోసిన ఇండ్లలో 8,801 మాత్రమే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూప్‌లెవల్ పూర్తిచేస్తే రూ.1.25 లక్షలు, స్లాబ్ వేస్తే రూ.1.75 లక్షలు, పెయింటింగ్ పూర్తిచేసిన తరువాత రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తున్నది. పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణానికి ఈ డబ్బులు సరిపోకపోవడంతో లబ్ధిదారులు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ముగ్గురు మంత్రులున్నా.. తప్పని ఇసుక కష్టాలు..
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక కష్టాలు లబ్ధిదారులకు తప్పడం లేదు. ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఆయా గ్రామాలకు సంబంధం లేకుండా ఇసుక రీచ్‌లను కేటాయించడంతో రవాణా పేరుతో ట్రాక్టర్ యజమానులు లబ్ధిదారులను నిలువునా దోచుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందు ట్రాక్టర్ ఇసుక 4 నుంచి 5వేల వరకు ధర ఉండగా ప్రస్తుతం 7 నుంచి 10వేల వరకు వసూలు చేస్తున్నారు. గోదావరి ఇసుక అయితే ఒక్కో టన్ను రూ.2 వేల వరకు పలుకుతున్నది. ఇసుక, ఇటుక, సిమెంట్, స్టీల్ ధరలు పెరగడంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం పడి అప్పుల పాలవుతున్నారు.
జాడలేని ఇసుక డిపోలు
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం వానకాలంలో ఇసుక ఇబ్బంది రాకుండా ఉండేందుకు జిల్లా మంత్రులు ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో రెండు లేదా మూడు గోదావరి ఇసుకతో డిపోలను స్వయం సహాయక సంఘాలతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ నేటివరకు ఆ ఇసుక డిపోల జాడ ఎక్కడా కనిపించడం లేదు. వానకాలం కావడంతో ప్రస్తుతం నదులు, వాగులు, మున్నేరులో వరదలు పారుతున్నాయి. దీంతో అనధికార స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్న అక్రమ ఇసుక రవాణాదారులు తమకు ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు.
సంబంధం లేకుండా ఇసుక రీచ్‌ల కేటాయింపు
జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుకను అందించేందుకు అధికారులు అందుబాటులో ఉన్న ఇసుక రీచ్‌లను జూన్ నెలలోనే గుర్తించారు. ఆ ఇసుక రీచ్‌ల్లో లబ్ధిదారులు కేవలం సీనరేజ్, లోడింగ్, రవాణా చార్జీలు మాత్రమే చెల్లించేలా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇసుక రీచ్‌లు దూరంకావడంతో లబ్ధిదారులపై ఆర్థికభారం పడుతున్నది.
మధిర నియోజకవర్గం లబ్ధిదారులకు బోనకల్, మధిర మండలాల వారికి వైరా నది కలకోట, బ్రాహ్మణపల్లి, రాయన్నపేట, ఖమ్మంపాడు, చిలుకూరు, నక్కలగరుబు.. ముదిగొండ, చింతకాని మండలాల వారికి మున్నేరు నుంచి పెద్దమండవ, గంధసిరి, గంగాపురం, చిన్నమండవ.. ఎర్రుపాలెం మండలం వారికి కట్టెలేరు నది నుంచి తక్కెల్లపాడు, చొప్పకట్లపాలెం, ఇనగాలి గ్రామాల రీచ్‌ల నుంచి ఇసుక కేటాయించారు.
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండలం, తిరుమలాయపాలెం మండలం లబ్ధిదారులకు ఉర్లుగొండ ఏరు, ముజాహిద్‌పురం, ఆకేరు పరిధిలో హైదర్‌సాయిపేట గ్రామాల రీచ్‌ల నుంచి.. కూసుమంచి మండలం, నేలకొండపల్లి మండలాల లబ్ధిదారులకు పాలేరు అలుగు ఏరు నుంచి జక్కేపల్లి రీచ్ ద్వారా ఇసుకను కేటాయించారు. అయితే ఇక్కడే చిక్కు వచ్చిపడింది. ఖమ్మంరూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాల్లో లబ్ధిదారులు హైదర్‌సాయిపేట నుంచి ఇసుక తెచ్చుకోవాలి అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఇసుక రవాణా ఖర్చులే ట్రాక్టర్ లేదా టిప్పర్ యజమానులు 5వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అంత దూరం వెళ్లి ఇసుక తెచ్చుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి బదులు పెద్దమండవ, గంధసిరి రీచ్‌ల ద్వారా అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో గంగదేవిపాడు ఏరు నుంచి గొల్లగూడెం రీచ్ ద్వారా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల లబ్ధిదారులకు ఇసుక కేటాయించారు. కానీ తల్లాడ మండలంలో ఉన్న రీచ్‌కు వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి మండలాల లబ్ధిదారులకు దూరం కావడంతో ఉచిత ఇసుక పథకం కొండెక్కింది.
వైరా నియోజకవర్గంలో వైరా ఏరు పరిధిలో ఖానాపురం, విప్పలమడక రీచ్‌ల ద్వారా ఏన్కూరు, కొణిజర్ల, వైరా, సింగరేణి మండలాల లబ్ధిదారులకు కేటాయించారు. సింగరేణి, ఏన్కూరు, కొణిజర్ల మండలాల లబ్ధిదారులకు ఆ రీచ్‌లు చాలా దూరమవుతున్నాయి.
ఖమ్మం నియోజకవర్గం, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలానికి ఇసుక రీచ్‌లను కేటాయించలేదు. ఇక్కడి లబ్ధిదారులకు ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తారో తెలియని దుస్థితి.
ఇసుక డిపోలు ఏర్పాటు చేయలేదు
ఇందిరమ్మ లబ్ధిదారుల కోసం ఇసుక డిపోలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇసుక రీచ్‌ల ద్వారానే లబ్ధిదారులు ఇసుకను తెచ్చుకోవాలి.
– సాయినాథ్, మైనింగ్ ఏడీ, ఖమ్మం జిల్లా
కూపన్లు అందిస్తున్నాం..
ఉచిత ఇసుక కోసం కూపన్లు అడిగిన లబ్ధిదారులకు ఆయా మండలాల తహసీల్దార్ల ద్వారా అందిస్తున్నాం. ప్రస్తుతం ఎన్ని కూపన్లు జారీ చేసింది మా వద్ద సమాచారం లేదు. ఇసుక రీచ్‌లు దూరం ఉన్నా కేటాయించిన దానినుంచే లబ్ధిదారులు తెచ్చుకోవాలి. లేకుంటే సొంతంగా కొనుగోలు చేసుకోవాలి.
-శ్రీనివాస్, హౌసింగ్ పీడీ, ఖమ్మం జిల్లా