కొత్తగూడెం క్రైం/ భద్రాచలం, ఫిబ్రవరి 17: మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువతని పట్టి పీడిస్తున్న గంజాయి మత్తును వదిలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రోహిత్‌రాజు స్పష్టం చేశారు. ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం పేరుతో సినీ ఫక్కీలో ప్రైవేటు బస్సులో గంజాయి రవాణా చేస్తున్న 8 మందిని భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలోని తన కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల ఈ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భద్రాచలం టౌన్ ఎస్సై పీవీఎన్ రావు తన సిబ్బందితో పట్టణంలోని ఇందిరాగాంధీ నగర్ బొమ్మ సెంటర్ వద్ద శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సును ఆపి తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఓ వ్యక్తి భయంతో అనుమానాస్పదంగా కిందకు దిగుతుండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సదరు వ్యక్తితోపాటు మరో ఏడుగురు బంధువులు ఉన్నట్లు తెలిసింది. వీరికి సంబంధించిన సామాన్లను తనిఖీ చేయడంతో వారు ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం ముసుగులో తరలిస్తున్న డోర్ మ్యాట్ లోపలి భాగంలో, ప్లాస్టిక్ ట్రేల బండిల్స్ మధ్యలో గంజాయి నింపి సినీ ఫక్కీలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.కోటి విలువైన నాలుగు క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నారు.
సదరు వ్యక్తులు హర్యానా రాష్ట్రంలోని పానిపట్, హిల్సార్, భవానీ ఖేదా జిల్లాలకు చెందిన బల్జీత్, రవిదాస్, సూరజ్, గీన్న, తక్ధీర్, రామ్ మెహర్, సుందర్, రాజ్పతిగా విచారణలో తేలింది. వీరంతా కలిసి ఒడిశా రాష్ట్రం కలిమెల, మల్కాన్‌గిరి ప్రాంతాల్లో కోలా ఆనంద్ అలియాస్ బుజ్జి, బాల్‌రెడ్డిల వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తీసుకు వస్తున్నారు. కాగా, ఎవరైనా గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజు కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్, టౌన్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ, ఎస్సై జలకం ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.