ఖమ్మంరూరల్, జనవరి 25 : కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయడంతో ఆయా గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి వరకు మరోమారు సర్వేలు చేశారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నానాహైరానా పడ్డారు. ఇంటింటికీ తిరిగి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేందుకు తుది జాబితాను సిద్ధం చేశారు.
ఖమ్మంరూరల్ మండలంలోని ఆరెంపుల గ్రామంలో 79 మందిని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి, 62 మందిని నూతన రేషన్‌కార్డుల కోసం, 134 మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి, మరో 614 మందిని రైతుభరోసాకు అర్హులుగా గుర్తించారు. మొత్తం నాలుగు పథకాలకు సంబంధించి 814 మందిని ప్రాథమికంగా అర్హుల జాబితాలో చేర్చారు. వీరితోపాటు గ్రామసభలో కొత్త రేషన్‌కార్డులకు 64మంది, ఇందిరమ్మ ఇండ్లకు 72 దరఖాస్తులను అధికారులను స్వీకరించారు. దీంతో అదనంగా మరో 136 దరఖాస్తులను స్వీకరించినైట్లెంది.
మొత్తంగా నాలుగు పథకాలకు గాను 950 మంది దరఖాస్తులను స్వీకరించారు. అర్హత కలిగిన వారిలో పాత, కొత్త జాబితాలో ఎంతమంది ఉన్నారు అనేది నిర్ధారణ చేసేందుకు శనివారం రాత్రి ఎంపీడీవో ఎస్.కుమార్, తహసీల్దార్ పీ.రాంప్రసాద్, మండల స్పెషల్ ఆఫీసర్ బీ.జ్యోతి, ఏవో ఉమానగేష్, ఉపాధిహామీ పథకం మండల ఏపీవో శ్రీదేవి పంచాయతీ కార్యదర్శితో కలిసి మరోమారు సర్వే చేశారు. జాబితాలో కొందరు పేర్లకు సంబంధించి నిజానిజాలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సర్వే చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి సంక్షేమ పథకాల ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోమారు సర్వే చేశామని, ఆదివారం ఉదయం నాటికి పూర్తి జాబితా సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
జూలూరుపాడు, జనవరి 25 : మండలంలోని అనంతారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన అధికారులు ఆదివారం వైరా ఎమ్మెల్యే చేతుల మీదుగా అర్హులకు మంజూరు పత్రాలను అందించనున్నారు. దీనిలో భాగంగా లబ్ధిదారుల జాబితాను తయారు చేసేందుకు రెవెన్యూ, వ్యవసాయశాఖ, మండల పరిషత్, ఉపాధిహామీ అధికారులు శనివారం రాత్రి వరకు అనంతారం గ్రామంలోని ఇంటింటికీ తిరిగి మళ్లీ సర్వే చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 18మందిని, ఇందిరమ్మ ఇండ్ల కోసం 75 మందిని అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.