ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉగాది పర్వదినం నాడు ఖమ్మంజిల్లాలో నూతన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి టెంపుల్ చుట్టూ భూ సేకరణ చేయాల్సిన అవసరం ఉందని, సీఎం మొదటి దశ కింద భూ సేకరణకు రూ.34 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
పేదలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం సరఫరా ఉగాది నుంచే ఇ వ్వాలని నిర్ణయించామన్నారు. మార్చి నెలాఖరు నాటికి రైతుభరోసా నిధులు జమ చేయడం జరుగుతుందని మం త్రి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్డీవో నరసింహరావు, నేషనల్ హై వే మేనేజర్ దివ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్, రఘునాధపాలెం మండలంలో పలు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరా పథకానికి మరో రూ.220 కోట్లను ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ప్రధాన రోడ్ల ఫుట్‌పాత్ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. ప్రజలు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి సహకరించాలని కోరారు.