భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ) : ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెడితే ఊర్కునేది లేదని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. నియోజకవర్గంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా పత్తి విక్రయిస్తున్న రైతులను తేమ శాతం పేరుతో కొర్రీలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని, దళారులు తెచ్చిన పత్తిని తీసుకుంటూ, రైతుల పత్తిని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. నిబంధనలు తట్టుకోలేక రైతులు ప్రైవేటులో అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. అలాగే లగచర్లలో ఫార్మా కంపెనీ పేరుతో రైతుల భూములు లాక్కోవాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని, రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ సర్కారుపై రైతులు తిరగబడితే పతనం ఖాయమన్నారు.