పెనుబల్లి, డిసెంబర్ 19 : మనపై ఎంతో నమ్మకం ఉంచి ఓటుతో గెలిపించిన ప్రజలకు క్రమశిక్షణతో సేవ చేయాలని, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజా సేవకు అంకితం కావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూరు మండలంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డులను కల్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఆయన ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరి పాలనలో పల్లెలు అభివృద్ధి చెందుతాయో అనేది గుర్తించిన ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారని, దీనిని బట్టి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా స్వచ్ఛందంగా వినియోగించుకుంటారే తప్ప బెదిరింపులకు భయపడే రోజులు పోయాయన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సేవ చేయడానికి కానీ బెదిరింపులకు పాల్పడటానికి కాదని, ఇకనైనా ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసం, ఊపును ఇదే విధంగా కొనసాగించి భవిష్యత్ ఎన్నికలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, మేకల కృష్ణ, కొరకొప్పుల ప్రసాద్, బోబోలు లక్ష్మణరావు, దేవరపల్లి నాగప్రసాద్, భాస్కర్‌రావు, రావూఫ్, సీహెచ్.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.