సత్తుపల్లి టౌన్, జూలై 11: రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అది ముఖ్యమంత్రి, మంత్రుల అత్యాశకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చింతకానిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సభ రాజకీయ సభనో, అభివృద్ధి సభనో ప్రజలకూ అర్థంగాక వారు తలపట్టుకున్నారని ఎద్దేవాచేశారు. ‘రైతు ఆశీర్వాద సభ’ పేరిట చింతకానిలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులపైనా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సండ్ర తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ సభలో సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో ఆవేశం, ఆక్రోశమే వెళ్లగక్కారే తప్ప జిల్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదని విమర్శించారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఖమ్మం జిల్లాకు గడిచిన 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి పదేపదే అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీళ్లు వదిలితే భద్రాచలం మునుగుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి.. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎలా తప్పిస్తారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
స్వరాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన కేసీఆర్ గురించి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ గురించి మళ్లీ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలకులు అధికారం చేపట్టి 30 నెలలు దాటినా ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. తదుపరి ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలనే విషయాన్ని తేల్చేది ప్రజలేనని అన్నారు. అసలు, సగంలో ఆగిపోయిన రుణమాఫీ గురించి, ఇంకా జమ చేయని బోనస్ గురించి ఊసెత్తని సభ.. రైతు ఆశీర్వాద సభ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను దూషించాలనే దుర్బుద్ధితో పెట్టిన సీఎం పరాకాష్ట సభ అవుతుందని ఎద్దేవాచేశారు.