సత్తుపల్లి టౌన్, ఆగస్టు 17 : బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తుపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ మండల, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఊరూరా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, మళ్లీ బీఆర్ఎస్ పాలనే కావాలని కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకు మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలు ప్రజలకు మరింత చేరువకావాలని సూచించారు. సమావేశంలో నాయకులు కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డా శంకర్రావు, మల్లూరు అంకమరాజు, బొడ్డు శివ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.