మణుగూరు టౌన్, సెప్టెంబర్ 2 : ప్రజలను ఆపద సమయంలో ఆదుకోని ప్రజా పాలన ఎందుకని? భారీ వర్షాలతో నియోజకవర్గం అతలాకుతలమైనా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముగ్గురు మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇస్తే.. విపత్తుల సమయంలో వారు తుపాకీ గుండుకి కూడా దొరకడం లేదంటూ ఎద్దేవా చేశారు. వరదల సమయంలో ప్రజలకు సహాయం చేయకపోగా మనోధైర్యం ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగర పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, సర్వం కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మొద్దు నిద్రలో ఉన్నాడా? ఇంత జరుగుతుంటే ఎక్కడా సహాయం చేసిన దాఖలాలు కనిపించలేదన్నారు. రైతులకు జరిగిన పంట నష్టంపై అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని డిమండ్ చేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ముత్యంబాబు, కుర్రి నాగేశ్వరరావు, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీను, కుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.