మణుగూరు టౌన్, నవంబర్ 14 : ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చేస్తున్న ప్రతీ తప్పును ఊరూరా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మణుగూరు పట్టణంలో గురువారం నిర్వహించారు. తొలుత పట్టణంలో రేగా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కుమ్రంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసి టైంపాస్ రాజకీయాలు చేస్తున్నదని, గవర్నెన్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేయకుండా అనుభవ లేమితో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో రోజుకో మాట చెబుతున్న ప్రభుత్వ పెద్దల తీరు గురించి రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు.
గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం చేపట్టి పంచాయతీలు, గ్రామాల్లో కమిటీలు వేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీ మారితే మళ్లీ రానిచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పారు. పదవులు రావాలంటే ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలని, అప్పుడు గుర్తింపుతోపాటు పదవులు దక్కుతాయన్నారు. సర్పంచ్‌లుగా బరిలో నిలిచే అభ్యర్థులు గ్రామాలు విడిచి రావొద్దని, వంద శాతం పాత వారికే అవకాశం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉప ఎన్నికలు వస్తే భద్రాచలంలో పార్టీ అభ్యర్థి పోటీ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం రేగా కాంతారావును, నూతనంగా ఎన్నికైన పార్టీ కన్వీనర్, కో కన్వీనర్లను ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.