భద్రాచలం, నవంబర్ 27: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. భద్రాచలంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ అధ్యక్షతన పార్టీ మండల కమిటీ జనరల్ బాడీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్‌లతో కలిసి రేగా మాట్లాడారు. పదేళ్లపాటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గత కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని; ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తుందని గుర్తుచేశారు.
అలవిగాని హామీలతో 11 నెలల క్రితం గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలన్నీ విస్మరించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాలనను గాలికొదిలేసి ఢిల్లీ టూ రాజధాని, రాజధాని టూ ఢిల్లీ తిరగడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడాన్నే ముఖ్యమంత్రి, మంత్రులు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సొంత నియోజకవర్గ ప్రజలకే సమాధానం చెప్పలేని సీఎం రేవంత్.. రాష్ర్టాన్ని ఏ విధంగా పాలిస్తాడని ప్రశ్నించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా.. భద్రాచలం నియోజకవర్గ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ను గెలిపించారని గుర్తుచేశారు. ఆ కృతజ్ఞత లేకుండా స్థానిక ఎమ్మెల్యే.. 420 పార్టీ వైపు వెళ్లారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో భద్రాచలంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రేగా స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు నర్సింహమూర్తి, గంపా రాంబాబు, కోటగిరి ప్రమోద్‌కుమార్, దొడ్డి తాతారావు, పవన్‌కుమార్, కణితి రాముడు, ఎండి.జానీపాషా, కావూరి సీతామహాలక్ష్మి, తమ్మళ్లపల్లి గణేశ్, పూజా లక్ష్మి, కేవీ.రమణ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.