ములకలపల్లి, ఆగస్టు 12 : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి భద్రాద్రి రామయ్య పేరుతో గత సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, దీనికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇదంతా ప్రజలకు తెలుసని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రయల్ రన్ సందర్భంగా మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ కేసీఆర్ను విమర్శించే అర్హత జిల్లాలోని ముగ్గురు మంత్రులకు లేదని, మీకు చేతనైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వమే అంతా చేస్తే.. ఇప్పుడు మీరు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు వస్తున్నాయా.. అని ఆయన ప్రశ్నించారు. పథకాల అమలుకు నిధులు ఇచ్చే సత్తా మీకు లేదని ప్రజలకు ఎప్పుడో అర్థమైందన్నారు.
రైతులకు రైతు భరోసా ఊసే లేదని, రుణమాఫీకి కొర్రీలు పెట్టి 15 శాతం రైతులకు కూడా మాఫీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. వరదలొచ్చి నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఎమ్మెల్యే మాత్రం దుబాయ్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నాడని, పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోతే నెల రోజులైనా పట్టించుకునే దిక్కులేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పీహెచ్సీకి నూతన భవనం నిర్మించి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదన్నారు.
నియోజకవర్గంలోని ప్రజోపయోగ పనులన్నీ అర్థంతరంగా నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, నాయకులు మెహ్రామని, సీతారాములు, హనమంతు, రాజేశ్, సుందరరావు తదితరులు పాల్గొన్నారు.