భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం గణేష్టెంపుల్, ఏప్రిల్ 30 : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతీ కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచించారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లతో గురువారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వనమా పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ సూచనలు సలహాల మేరకు కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని, మే నెలలో శ్రీకారం చుట్టబోయే పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దొంగ ఓట్లు, ఎక్కడా రిగ్గింగ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ ఏజెంట్లపై ఉందన్నారు. త్వరలోనే బూత్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, సర్పంచ్ శ్రీకాంత్, కార్పొరేటర్ సాగర్, బత్తుల మధుచంద్, వనమా రాఘవేంద్రరావు, బీమా శ్రీధర్, అనుదీప్, మాదాసి పద్మ, అన్వర్పాషా, మంజుల, దామోదర్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.