భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (నమస్తే తెలంగాణ) : అబద్ధాల కాంగ్రెస్‌ను మరోసారి నమ్మితే మళ్లీ మోసపోయి గోసపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హామీలు అమలుచేయని కాంగ్రెస్‌ను ఇంకెప్పుడూ నమ్మవద్దని అన్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతిపక్షం ఎప్పుడూ బలమైన శక్తిగా ఉండాలని అన్నారు. అందుకోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల గళం వినిపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఖమ్మంవరంగల్నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన కొత్తగూడెం క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపుతోందని ఆరోపించారు. మరోసారి ఆ పార్టీని నమ్మితే ఇక్కడి సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. అసలేమీ ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టికొట్టారని దుయ్యబట్టారు. రూ.15 వేల రైతుభరోసా ఇస్తానని చెప్పిన ఆ ముఖ్యమంత్రి.. నాట్లు వేశాక కూడా పంటల సాయం ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. చివరికి ఓట్లు వేశాక ఇస్తానంటూ కబుర్లుచెబుతున్నారని విమర్శించారు. ఇలాంటి అబద్ధాల కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పట్టుభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
తెలంగాణను సాధించిన కేసీఆర్.. తన పాలనలో స్వరాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఇంతటి అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగలేదని స్పష్టంచేశారు. స్వాతంత్య్రం రాకముందు తెలంగాణలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలను, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకూ నూతన కలెక్టరేట్ తెచ్చామని అన్నారు. 2014 నుంచి 2024 వరకు 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రమూ ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. ఇచ్చినట్లు రుజువు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. పట్టభద్రులు మరోసారి ఆలోచించి విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే
కాంగ్రెస్ తరఫున పోటీ చేసే వ్యక్తి తీన్మార్ మల్లన్న కాదని.. గోల్మాల్ మల్లన్న అని విమర్శించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, యూట్యూబ్ చానల్ పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నాడని, జనం అతడిని నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వుర్లు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, తెలంగాణ ఉద్యమకారుడు దిండిగల రాజేందర్, భద్రాచలం ఇన్చార్జి మానె రామకృష్ణ, ఎంపీపీలు, సోనా, శాంతి, జడ్పీటీసీ వెంకటరెడ్డి, నాయకుడు వనమా రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి జిల్లా నుంచి పట్టభద్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘జై తెలంగాణ’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. కేటీఆర్‌తో ఫొటోలు సెల్ఫీలు దిగేందుకు పట్టభద్రులు పోటీపడ్డారు.
కొత్తగూడెం అర్బన్, మే 20: కొత్తగూడెం గ్రాడ్యుయేట్లు మరోసారి పొరబడరని తాను నమ్ముతున్నానని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. పొరపాటున పొరబడి మరోసారి కాంగ్రెస్‌ను నమ్మితే మన బతుకులన్నీ చీకటిమయమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ప్రతిపక్షం నుంచి ప్రశ్నించే గొంతుక శాసన మండలిలో ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. సాధారణ తరగతి కుటుంబంలో పుట్టిన రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలానీలో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ మాతృభూమికి సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగూడెం ప్రాంతం అగ్నిగుండం లాంటిదని గుర్తుచేశారు. పాల్వంచ కేటీపీఎస్‌లో జరిగిన తిరుగుబాటు.. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఇక్కడి ప్రజలు అంతటి చైతన్యమంతులని అన్నారు. ఇలాంటి ప్రాంతంలోని ఇక్కడి పట్టభద్రులు తనకు అత్యధిక మెజార్టీ అందించి చరిత్రాత్మక తీర్పునివ్వాలని కోరారు.