రఘునాథపాలెం, డిసెంబర్ 5 : కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ మండలంలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు.
తాను మంత్రిగా ఐదేళ్లూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించానని, తనకు కేటాయించిన సీడీఎఫ్ నిధులతోపాటు ఎన్ఆర్ఈజీఎస్, డీఎంఎఫ్టీ, సుడా నిధులన్నీ రఘునాథపాలెం మండలానికే కేటాయించినట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు కళకళలాడిన పల్లెలు.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ అర్థం చేసుకొని పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేయడంతో గత ఎన్నికల్లో గిరిజనులు తమ తండాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో రూ.72 వేల కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం గొప్పలకు పోతున్నదని, క్షేత్రస్థాయిలోకి వెళ్తే కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలకు తులం బంగారం, యువతులకు ఇస్తామన్న స్కూటీలు, మహిళలకు రూ.2,500ల ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇక రైతుబంధు నాట్ల సమయానికి వస్తుందన్న గ్యారెంటీ కూడా లేకుండా పోయిందన్నారు. నాట్లకు నాట్లకు రావాల్సిన రైతుబంధు.. ఓట్లకు ఓట్లకు ఇచ్చే పథకంలా తయారైందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఏనాడూ లేని యూరియా కష్టాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కనిపించాయని చెప్పారు.
బీఆర్ఎస్ బలపరిచిన చిమ్మపూడి సర్పంచ్ అభ్యర్థి గుత్తా రవి సౌమ్యుడని, అలాంటి వ్యక్తిని సర్పంచ్‌గా గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి గుత్తా రవి గెలుపు ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేయాలని పిలుపునిచ్చారు. కాగా.. చిమ్మపూడి గ్రామం నుంచి సూరంశెట్టి కుటుంబం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరగా పువ్వాడ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా నాయకుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సర్పంచ్ అభ్యర్థులు గుత్తా రవి, తాతా కళావతి, వెంకటేశ్వర్లు, కొర్ర శ్రీను, కుతుంబాక నరేశ్, కొండపర్తి లక్ష్మి, బీఆర్ఎస్ నేతలు మాదంశెట్టి హరిప్రసాద్, కార్పొరేటర్ కూరాకుల వలరాజు, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌లు గొర్రె కృష్ణవేణి, చెరుకూరి ప్రదీప్, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మచ్చా నరేందర్, గుండ్ల ముత్తయ్య, విజయ్‌రెడ్డి, కాంపాటి రవి, నాగండ్ల పాపారావు, చెన్నబోయిన సైదులు, నాడండ్ల భద్రయ్య, యాసా రామారావు, తేజావత్ రామోజీ, తొలుపునూరి దానయ్య తదితరులు పాల్గొన్నారు.