భద్రాచలం, మే 7 : నూతన రహదారి నిర్మాణ క్రమంలో అటవీ శాఖకు చెందిన కొన్ని చెట్లను నరికివేశారనే అభియోగంపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు అటవీ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలం అటవీ శాఖ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో నూతనంగా రోడ్డు వేస్తున్న క్రమంలో అటవీ శాఖకు చెందిన కొన్ని చెట్లను కాంట్రాక్టర్ తొలగించాల్సి వచ్చింది.
దీనిని సాకుగా చూపి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ అధికారి సుజాత, చర్ల ఇన్చార్జి డీఆర్వో కృష్ణయ్యలు రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించిన కాంట్రాక్టర్.. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించి పరిస్థితిని వివరించారు. వారు పన్నిన పథకం ప్రకారం అందులో మొదటి విడతగా రూ.3.5 లక్షలు సదరు అధికారులు సుజాత, కృష్ణయ్యలకు కాంట్రాక్టర్ గురువారం ఇస్తుండగా.. అప్పటికే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకొని అరెస్టు చేశారు. వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగినా, తీసుకున్నా తమకు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
కాగా, భద్రాచలంలో తొలిసారిగా అటవీ శాఖ డివిజనల్ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది. అటవీ శాఖలో అవినీతి ఆరోపణలకు సంబంధించి అనేక ఘటనలు చోటు చేసుకున్నా.. వాటిని శాఖాపరమైన చర్యలతోనే సరిపెడుతుంటారు. అలాగే మూడు నెలల క్రితం ఏసీబీ అధికారులు భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి, అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఖదీర్‌ను అరెస్టు చేసిన విషయం విదితమే. గతంలో భద్రాచలం ఎస్టీవో, తహసీల్దార్ కార్యాలయం, ఏడాది క్రితం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి అప్పటి సీఐ, అతడి గన్‌మెన్‌ను అరెస్టు చేశారు. ఏడాది కాలంలోనే పలుమార్లు భద్రాచలంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారింది.