Ind vs Zim | ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశకు గురైన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే హరారే చేరుకుంది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో విజయాలతో తిరిగి గెలుపు బాట పట్టాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే మరో అంతర్జాతీయ సిరీస్ ఆడుతున్న భారత్‌కు ఇది కీలక పరీక్షగా మారింది. యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనుండగా, గత సిరీస్‌లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని మెరుగైన ప్రదర్శన చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు పలువురు ఆటగాళ్లు నేరుగా హరారే చేరుకోగా, మిగతా సభ్యులు తాత్కాలిక ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారత్ నుంచి జింబాబ్వేకు బయలుదేరారు.టీ20 సిరీస్ షెడ్యూల్ చూస్తే.. మొదటి టీ20: జూలై 23న సాయంత్రం 4:30 గంటలకు, రెండో టీ20: జూలై 25 సాయంత్రం 4:30 గంటలకు, మూడో టీ20: జూలై 26 సాయంత్రం 4:30 గంటలకు జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్‌లోనే జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి అభిమానులకు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే… మ్యాచ్‌లు సాధారణ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రసారం కావు. స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో పాటు జియోహాట్‌స్టార్, సోనీలివ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉండదు.
భారత్-జింబాబ్వే టీ20 సిరీస్‌ను FanCode యాప్‌లో మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఇందుకోసం రూ.35తో మ్యాచ్ పాస్ లేదా అందుబాటులో ఉన్న సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. టెలివిజన్‌లో వీక్షించాలనుకునే అభిమానులు యునైట్8 స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు డీడీ స్పోర్ట్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.వరుస పరాజయాల తర్వాత ఈ సిరీస్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని టీమిండియా భావిస్తుండగా, యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారత్ జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్.